మార్కాపురం జిల్లా ఏర్పాటులో పక్షపాతం
శ్రీశైలం, దర్శిని మార్కాపురం జిల్లాలో కలపాలి గిద్దలూరు నియోజకర్గాన్ని మార్కాపురం రెవెన్యూ డివిజన్‌లో కలపాలి సీపీఐ నేత నాసరయ్య, ీసీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యులు సోమయ్య
మార్కాపురం: మార్కాపురం జిల్లా ఏర్పాటులో ప్రభుత్వం పక్షపాతం చూపిందని, దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశంలో కొనసాగించడం ద్వారా వివక్షచూపిందని, అలా కాకుండా మార్కాపురంలోనే కలపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు దగ్గుపాటి సోమయ్య, సీపీఐ కార్యదర్శి సభ్యుడు అందె నాసరయ్య డిమాండ్ చేశారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం, దర్శి నియోజకవర్గాలను కలపాలని, గిద్దలూరు నియోజకవర్గాన్ని ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గా చేయటమో లేదా మార్కాపురం రెవెన్యూ డివిజన్‌లో కలపాలని కోరారు. ఆ నియోజకవర్గాన్ని కనిగిరి రెవెన్యూ డివిజన్‌లో కలపటం వలన ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. దొనకొండ, కురిచేడు మండలాలు మార్కాపురానికి దగ్గరగా ఉన్నాయని, ఆ నియోజకవర్గం దర్శిని ఒంగోలులో కలపడం వలన ఈ మండలాల ప్రజలు పనుల కోసం 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న మార్కాపురానికి కాకుండా 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒంగోలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. శాసీ్త్రయత లేకుండా విభజన చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని, ప్రభుత్వం ఈ విషయం గమనించి దర్శిని మార్కాపురం జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు జిల్లా ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి జరగదన్నారు. అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి 18 నెలలు దాటిందని, అరకొర నిధులతో ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. మార్కాపురం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే నిర్మించి ఉచిత వైద్యాన్ని ఈ ప్రాంత ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాజు, రాజశేఖరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


