నయవంచక పాలకులకు బుద్ధి చెప్పాలి
ఒంగోలు టౌన్: కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్న కేంద్ర రాష్ట్ర పాలకులకు ప్రజలు గుణపాఠం చెప్పాలని సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అమలు చేయడంలో రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ చట్టాలు, మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా బుధవారం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో పలువురు రైతు, కార్మిక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చుండూరి రంగారావు మాట్లాడుతూ నల్ల వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ఐదేళ్ల క్రితం కేంద్రం ఇచ్చిన హామీని అమలు చేయకుండా దగా చేసిందని విమర్శించారు. పంటల మద్దతు ధరలకు చట్టపరమైన హామీ ఇవ్వకుండా రద్దయిన నల్ల చట్టాలకంటే ప్రమాదకరమైన చట్టాలను రూపొందించిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేలా సంస్కరణలను తీసుకొచ్చిందని తెలిపారు. సీపీఎం సీనియర్ నాయకుడు పమిడి వెంకటరావు, సీపీఐ సీనియర్ నాయకుడు కొత్తకోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికులను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వంపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు కూలి సంఘం రాష్ట్ర నాయకుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతు కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లలిత కుమారి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు ,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జజ్జురు జయంతి బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కె మాబు, జీవీ కొండారెడ్డి, పి.కల్పన, జి.శ్రీనివాసరావు, జి.రమేష్, చీకటి శ్రీనివాసరావు, రాజశేఖర్, పద్మ, కోటేశ్వరరావు, సీహెచ్ రాంబాబు, జి.శేషయ్య, బాలకోటయ్య, మహేష్ పాల్గొన్నారు.


