రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలి
అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించడమే లక్ష్యంగా జగనన్న పాలన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి
ఒంగోలు టౌన్: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని, దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు, సమాన గౌరవం ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం 76వ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంలో పరిపాలనా విధి విధానాలు రూపొందించారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తూ దేశ ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించిన ఘనత అంబేడ్కర్‌కు దక్కుతుందన్నారు. దేశంలో వాక్ స్వాతంత్య్రం లేని రోజుల నుంచి తమ హక్కుల కోసం గొంతెత్తి మాట్లాడే పరిస్థితులను కల్పించింది ఈ రాజ్యాంగమేనని చెప్పారు. దేశంలోని పౌరులందరూ కలిసి మెలసి జీవించే సామరస్య వాతావరణానికి పునాదులు వేసిన రాజ్యాంగాన్ని మనందరం గౌరవించాలని చెప్పారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని 100 శాతం అమలు చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్ఫూర్తిగా నిలిచారన్నారు. జగనన్న పాలనలో విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పి బడుగు, బలహీన వర్గాల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయాలను స్థాపించి పరిపాలనను ప్రజల ఇంటి ముందుకు తీసుకెళ్లడం ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు బాబా సాహెబ్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలన్నారు. విలువలతో కూడుకొని పనిచేసే రాజకీయ పార్టీ సభ్యులుగా కాలరెగరేసి చెప్పుకుందామన్నారు. రానున్న రోజుల్లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేయాలన్నారు. సమాజంలోని అట్టడుగు ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పాటుపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణా రెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర అధ్యక్షుడు కటారి శంకర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, మురారి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు దామరాజు క్రాంతి కుమార్, షేక్ మీరావలి, రొండా అంజి రెడ్డి, దాసరి కరుణాకర్, పయనం శ్రీనివాస్, కూనం గౌతమ్, పెట్లూరి ప్రసాద్, దేవరపల్లి అంజిరెడ్డి, ఆనం శ్రీనివాసరెడ్డి, అగ్రహారం అంజిరెడ్డి, పల్నాటి రవీంద్ర, కుట్టుబోయిన సురేష్, తాటిపూగి కరుణాకర్, శ్రీనివాసరెడ్డి, మహిళా నాయకులు సయ్యద్ అఫ్సర్ బేగం, పేరం ప్రసన్న, బత్తుల ప్రమీల, పసుమర్తి గోవిందమ్మ, బండి శోభలత, మాధవిలత, నాటారు జనార్దన్ రెడ్డి, పిగిలి శ్రీనివాస్, దేవా, సన్నీ, బాలినేని శ్రీనివాస రెడ్డి, పీటర్, యోహాను, పులుసు సురేష్ తదితరులు పాల్గొన్నారు.


