సహకార శాఖ సంస్కరణలపై అవగాహన
ఒంగోలు వన్‌టౌన్: పరిశోధన, శిక్షణ, సహకార విద్య సంస్కరణలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ టీ నారాయణ సూచించారు. జిల్లాలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలను ఈ నెల 14 నుంచి 20 వరకూ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం ప్రగతి భవన్‌లోని డీఆర్‌డీఏ కార్యాలయంలో అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పీడీ మాట్లాడుతూ సహకార శాఖ ద్వారా నిర్వహిస్తున్న ఆధునిక సంస్కరణలను తెలిపారు. కార్యక్రమంలో విభాగేయ సహకార అధికారి డీ శ్రీనివాసులు, అసిస్టెంట్ ప్రాజెక్టు డైరక్టర్ సీ నీలకంఠారెడ్డి, జోనల్ ఎడ్యుకేషన్ అధికారి జీ శ్రీనివాసులు, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లు జె బాలసుబ్రహ్మణ్య కుమార్, ఎస్ తిరుమల నాయుడు, సహకార శాఖ, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: స్థానిక దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీలో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్‌లు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీ కళ్యాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500, మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని తెలిపారు. బీఏలో 6, బీకాం, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో 3, బీకాం హ్యూమన్ రిసోర్స్ ఆపరేషన్‌లో 13, బీఎస్సీ మ్యాథ్స్‌లో 6, బీఎస్సీ కెమిస్ట్రీలో 12 సీట్లు ఉన్నట్లు తెలిపారు. విద్యార్థినులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో రావాలన్నారు.


