వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు తీరని నష్టం
మాజీమంత్రి మేరుగు నాగార్జున
చీమకుర్తి రూరల్: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు తీరని నష్టం జరుగుతోందని సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మండలంలోని దేవరపాలెం పంచాయతీ పరిధిలో శనివారం జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ పేదలకు వైద్య విద్యతో పాటు మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలలను తీసుకొచ్చినట్లు చెప్పారు. అందులో ఐదు కళాశాలల నిర్మాణాలను పూర్తిచేసి తరగతులను ప్రారంభించారన్నారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. వాటిని పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో చంద్రబాబు బినామీలకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా పేదలను వైద్యవిద్యకు దూరం చేసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ చర్యలను ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బూచేపల్లి నాగిరెడ్డి వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు చీదర్ల శేషు, మండల రైతు విభాగం అధ్యక్షులు నల్లూరి రామచంద్ర రావు, నియోజకవర్గ సాంస్కృతిక అధ్యక్షుడు మక్కిన రాజేంద్ర, వంజా సుబ్బారావు, ఎం వీరాంజనేయులు, పవన్, పోల్ రెడ్డి వెంకరెడ్డి, కిష్టపాటి వెంకటేశ్వర్ రెడ్డి, సీహెచ్ వెంకటేశ్వర్లు రెడ్డి, పీ వెంకటరెడ్డి, టీ నాగులు తదితరులు పాల్గొన్నారు.


