రేషన్ సరుకులకు రాజకీయ గ్రహణం
దొనకొండ: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేషన్ పంపిణీకి రాజకీయ గ్రహణం పట్టింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డీలర్లపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే మండలంలోని గంగదేవిపల్లిలో నవంబర్ నెల రేషన్ ఇంత వరకు అందలేదు. వివరాల్లోకి వెళితే..గంగదేవిపల్లి డీలర్ శ్రీరామ్ వెలుగొండయ్య 40 ఏళ్లుగా డీలర్‌గా ఉన్నారు. అయితే చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతన్ని ఇబ్బందులకు గురి చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గతంలో తనిఖీలు నిర్వహించి సరుకుల కొలతలు తేడా ఉందని 6ఏ కేసు నమోదు చేశారు. దీనిపై డీలర్ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నాడు. డీలర్ సస్పెండ్ అయిన సమయంలో వీఆర్‌ఏ ద్వారా గ్రామ నాయకులు సరుకులు పంపిణీ చేశారు. అయితే ప్రస్తుతం కోర్టు స్టే ఉత్తర్వులతో గోడౌన్ నుంచి వెలుగొండయ్య రేషన్ సరుకులు తెచ్చుకోనివ్వకుండా నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రేషన్ సరుకులు తీసువచ్చినా నిన్ను వదిలేది లేదని హెచ్చరిస్తుండటంతో డీలర్ ఏం చేయలేక మిన్నకుండిపోయారు. దీంతో 12వ తేదీ వచ్చినా ఇంత వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయలేదు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు బయోమెట్రిక్ నిలిచిపోతుంది. దీంతో ఈ నెల సరుకులు అందుతాయో లేదోనని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్ బి.రమాదేవిని వివరణ కోరగా..పది రోజుల నుంచి రేషన్ సరుకులు తీసుకెళ్లమని డీలర్‌కు చెప్పినా రావడం లేదన్నారు. గోడౌన్ వద్ద పోలీస్ సెక్యూరిటీ ఉంచామని చెప్పినా డీలర్ రావడంలేదు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం.
గంగదేవిపల్లి దరిచేరని రేషన్ సరుకులు
కోర్టు ఉత్తర్వులు పట్టించుకోని అధికారులు
రేషన్ సరుకుల అందక లబ్ధిదారుల ఆవేదన


