తుపాను వేళ ఉద్యోగుల సమష్టి కృషి భేష్
కలెక్టర్ పి.రాజాబాబు
ఒంగోలు టౌన్: ఉద్యోగుల సమష్టి కృషి, సమర్ధ పర్యవేక్షణతో ఎలాంటి విపత్తులనైనా సులువుగా ఎదుర్కోవచ్చని, మోంథా తుపాను సమయంలో ఉద్యోగులు స్పందించిన తీరే దీనికి నిదర్శనమని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. స్థానిక రిమ్స్ ఆస్పత్రి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో మోంథా తుపాను సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందించారు. కలెక్టర్‌తో పాటుగా ఎస్పీ హర్షవర్థన్ రాజు, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణలతో కలిసి తుపాను అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మోంథా తుపాను సమయంలో ప్రభుత్వ ఉద్యోగులంతా సామర్ధ్యం మేరకు పని చేయడం వలన ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ఎస్పీ హర్షవర్థన్ రాజు మాట్లాడుతూ జిల్లాలో పోలీసు, రెవెన్యూ విభాగాల మధ్య మంచి సమన్వయం ఉండడంతో తుపాను పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని చెప్పారు. కొండపి పోలీసు స్టేషన్ పరిధిలో పొగాకు నారుమడుల దగ్గర వరదలో చిక్కుకున్న 121 మంది కూలీలను రక్షించడంలో ఎస్సై చురుగ్గా వ్యవహరించారని అభినందించారు. జిల్లా వ్యాప్తంగా పొంగిన వాగులు, వంకలు, చెరువుల వద్ద పోలీసు యంత్రాంగం పగలు రాత్రి పహారా నిర్వహించారన్నారు. గుండ్లకమ్మ గేట్లు ఎత్తేసిన తరువాత వరద నీరు గ్రామాలు, రహదారుల మీదకు చేరిందని, ఆ సమయంలో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో పోలీసులు బాగా పనిచేశారని చెప్పారు. అనంతరం జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయిలో విశిష్ట సేవలందించిన అధికారులను, సిబ్బందిని ఘనంగా సన్మానించి ప్రశంస పత్రాలను అందించారు. సభలో డీఆర్‌ఓ చిన ఓబులేశు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
జేసీకి ప్రశంస పత్రం ఇస్తున్న కలెక్టర్, పక్కన ఎస్పీ
తుపాను వేళ ఉద్యోగుల సమష్టి కృషి భేష్
తుపాను వేళ ఉద్యోగుల సమష్టి కృషి భేష్


