దొంగ అరెస్టు.. రూ.30 లక్షల సొత్తు స్వాధీనం
● విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ నాగరాజు
మార్కాపురం: చెడు వ్యసనాలకు లోనై, బెట్టింగులకు అలవాటు పడి మార్కాపురంలో చోరీలకు తెగబడిన దొంగను అరెస్ట్ చేసి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఒక డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ డాక్టర్ నాగరాజు తెలిపారు. మంగళవారం డీఎస్పీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన మార్కాపరంలోని సత్యనారాయణ స్వామి గుడి సమీపంలోగల షేక్ బాబు ఇల్లు, కూల్ డ్రింక్ షాపులో చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సుబ్బారావు, పట్టణ ఎస్సై సైదుబాబుతో కూడిన ప్రత్యేక బృందాలు కేసు దర్యాప్తు చేపట్టాయి. తర్లుపాడు మండలం గానుగపెంట గ్రామానికి చెందిన షేక్ ఈసూ మీరావలిపై గత 15 రోజుల నుంచి నిఘా ఉంచారు. ఈనెల 27వ తేదీ మధ్యాహ్నం పట్టణ శివారులలోని ఎస్టేట్ వై జంక్షన్ వద్ద మీరావలి దొంగలించిన ఆభరణాలు అమ్ముకోవడానికి వెళ్తుండగా సీఐ, ఎస్సై తమ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన ఆభరణాలను మార్కాపురం పట్టణంలోని కొసమట్టం ఫైనాన్స్, కీతన ఫిన్ సర్వే లిమిటెట్, ముత్తూట్ ఫిన్‌కార్ప్(గిద్దలూరు)లో తాకట్టు పెట్టగా వచ్చిన నగదుతో బెట్టింగ్ ఆడినట్లు విచారణలో అంగీకరించాడు. నిందితుడి నుంచి 50 గ్రాముల బంగారు లాంగ్ చైన్(నక్లెస్), 20 గ్రాముల బంగారు చైన్, 14.8 గ్రాముల బంగారు బ్రాస్‌లెట్, 8 జతలు బంగారు బుట్టలు, కమ్మలు, మాటీలు, జాలర్లు(81.9 గ్రాములు), బంగారు లాకెట్లు 32(35 గ్రాములు), 15 బంగారు ఉంగరాలు(69.7 గ్రాములు), వెండి కాళ్ల పట్టీలు(487.8 గ్రాములు), వెండి వడ్రాణం(216.2) గ్రాములు, వెండి కీ చెయిన్, డ్రోన్ కెమెరా, మోటరోలా మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. వీటి విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితుడిని మార్కాపురం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. దొంగను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ వి.హర్షవర్థన్‌రాజు అభినందించి రివార్డులు ప్రకటించారు.


