నీటి కుంటలో జారి పడి పశువుల కాపరి మృతి
టంగుటూరు: పశువులను మేపుతున్న కాపరి ప్రమాదవశాత్తూ నీటికుంటలో జారిపడి మృతిచెందిన సంఘటన టంగుటూరు మండలంలోని ఆలకూరపాడు గ్రామ శివారులో శనివారం చోటుచేసుకోగా, ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆలకూరపాడు గ్రామానికి చెందిన దివి సుందరయ్య (54)కు మతిస్థిమితం సరిగా ఉండదు. అతని అన్న వద్ద ఉంటూ పశువులు మేపుతూ ఉంటాడు. రోజూలాగే శనివారం గేదెలు తోలుకుపోయిన సుందరయ్య తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. ఆదివారం ఉదయం పెంటాయకుంటలో మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులకు గ్రామస్తులు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. మృతుడి అన్న దివి వెంకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లీశ్వరరావు తెలిపారు.


