ట్రావెల్స్ బస్సుల తనిఖీ
ఒంగోలు టౌన్: కర్నూలు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమై 19 మంది మృతిచెందిన నేపథ్యంలో జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సులను పోలీసు శాఖ అధికారులు శనివారం తనిఖీ చేశారు. ఒంగోలు నగరంలోని ముంగమూరు రోడ్డు, అద్దంకి బస్టాండు సెంటర్, టంగుటూరు టోల్ గేట్ వద్ద 65 ట్రావెల్ బస్సులను తనిఖీ చేశారు. బస్సుల్లో దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులు బయటపడడానికి అత్యవసరమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయో.. లేదో పరిశీలించారు. ఎమర్జన్సీ డోర్ల పనితీరును పరిశీలించారు. అత్యవసర సమయాలలో గాజు అద్దాలను పగులగొట్టేందుకు అవసరమైన బ్రేకర్లు అందుబాటులో ఉంచాలని, లగేజీ ప్రదేశాల్లో మండే పదార్థాలు, చట్ట విరుద్ధమైన వస్తువులను రవాణా చేయకుండా చూడాలని సూచించారు. బస్సు రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. బస్సు బయలుదేరడానికి ముందు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించుకోవాలని, రవాణా శాఖ నిబంధనలు పాటించాలని, లేకపోతే వాహనాలను రోడ్ల మీద తిరగనిచ్చేది లేదని స్పష్టం చేశారు.
స్కూల్, కాలేజీ బస్సుల తనిఖీ
ఒంగోలు సబర్బన్: నగరంలో కాలేజీ, స్కూల్ బస్సులను రవాణా శాఖ అధికారులు శనివారం తనిఖీ చేశారు. ఉప రవాణా కమిషనర్ ఆర్.సుశీల ఆదేశాల మేరకు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని కొన్ని కాలేజీలు, స్కూల్ బస్సులపై 22 కేసులు నమోదు చేసి సుమారు లక్ష రూపాయల అపరాధ రుసుం విధించారు.


