యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ రాజాబాబు
కొత్తపట్నం: భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ బుధవారం కొత్తపట్నంలో విస్తృతంగా పర్యటించారు. యంత్రాంగం చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. తీర ప్రాంత గ్రామాలైన ఈతముక్కల, కె.పల్లెపాలెం మత్స్యకారులతో మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలో వేటకు వెళ్లరాదన్నారు. గ్రామంలోని తుఫాన్ రక్షిత భవనాన్ని పరిశీలించి అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలను వివరించారు. అనంతరం కొత్తపట్నం బీచ్‌ను పరిశీలించి మత్స్యకారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలు కురిస్తే కొత్తపట్నంలో కొన్ని ప్రాంతాల్లో మునిగే అవకాశం ఉందని, వర్షంనీరు సముద్రంలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికల వచ్చిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు తీర ప్రాంత మండలాలైన సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం మండలాల్లో పర్యటించినట్లు తెలిపారు. పునరావాస కేంద్రాలను గుర్తించడంతో పాటు ఆ కేంద్రాల్లో వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఒంగోలు ఆర్డీఓ కళావతి, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డీఆర్‌డీఏ పీడీ నారాయణ, డీపీఓ వెంకటేశ్వరావు, మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాల శంకరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాఽధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్, తహసీల్దార్ శాంతి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


