
పచ్చనేతలకు ప్యాకేజీ...
వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నష్ట పరిహారం ఇవ్వడంలో జాప్యం ప్యాకేజీ కావాలంటే ఒక్కొక్కరి నుంచి రూ.20 వేలు పచ్చనేతల వసూలు ! అవినీతి పర్వానికి తెరలేపిన అధికారులు, టీడీపీ నేతలు రూ.కోట్లలో దండుకుంటున్నారంటున్న నిర్వాసితులు గెజిట్ ప్రకారం అందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ గతంలో వైఎస్సార్ చలువతోనే అన్నివర్గాలకు మేలు ప్యాకేజీ పెంచి అందరినీ సంతృప్తిపరిచిన వైఎస్ జగన్
యర్రగొండపాలెం: తీవ్ర కరువు కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రకాశంతోపాటు కడప, కర్నూలు జిల్లాల్లోని 30 మండలాల్లో ఉన్న సుమారు 16 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని నిల్వ ఉంచేందుకు పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, మార్కాపురం మండలంలోని గొట్టిపడియ, కంభం మండలంలోని కాకర్ల ప్రాంతాల్లో గ్యాప్‌లను నిర్మించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గ్యాప్‌లలో 11 గ్రామాలు ముంపునకు గురవుతాయి. వేలాది ఎకరాల పొలాలు ఆ గ్యాప్‌లలో కలిసిపోతాయి. ఆయా గ్రామాల్లో నివశించే ప్రజలు నిర్వాసితులుగా మారిపోయి తాము పుట్టిన గడ్డపై ఉన్న మమకారం, బంధాలను వదులుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా వారు నోచుకోని పరిస్థితి 2006 నుంచి ఏర్పడింది. అంతటి మహా త్యాగం చేసిన నిర్వాసితులు ఇప్పుడు టీడీపీ నాయకుల కబంద హస్తాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. వారు చెప్పిందే వేదంగా వినాల్సిన పరిస్థితి వచ్చింది.
గతంలో నిర్వాసితుల సంక్షేమానికి పెద్దపీట:
20 ఏళ్ల క్రితం ఆనాటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో అన్ని వర్గాలకు చెందిన నిర్వాసితుల బాధలు తెలుసుకొని వారు తృప్తిపడేలా ఆయన ప్యాకేజీ ప్రకటించారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులకు రూ.10 లక్షలుగా నష్టపరిహారం నిర్ణయించింది. ఈ పరిహారం సరిపోదని ప్రజలు చేసుకున్న విన్నపాలను ఆలకించి 2019లో అప్పటి సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా రూ.12.50 లక్షలకు పెంచారు.
నేడు చేయి తడిపితేనే ప్యాకేజీ...
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్యాకేజీ పచ్చనేతలకు వరంగా మారింది. వెలిగొండ ప్రాజెక్ట్‌కు సంబంధించి మార్కాపురం యూనిట్–1కు రూ.29.13 కోట్లు, కంభం యూనిట్–2కు రూ.35 కోట్ల ప్రకారం నిధులు విడుదలయ్యాయని ప్రచారంలో ఉంది. ఈ నిధులను కాజేసేందుకు టీడీపీ నాయకులు నిర్వాసితులను మభ్యపెడుతున్నారు. తక్షణమే ప్యాకేజీ వర్తింపచేస్తామని రూ.20 వేల ప్రకారం వసూలు చేయడం మొదలు పెట్టారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ముందుగా ఈ ప్రక్రియ మార్కాపురం యూనిట్–1లోని పెద్దారవీడు మండలం సుంకేసులలో ప్రారంభించినట్లు తెలుస్తోంది.
నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యం:
ముంపు గ్రామాలకు ప్యాకేజీ ఇవ్వడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. 2023లో అప్పటి ప్రభుత్వం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది తహసీల్దార్లను రంగంలోకి దింపింది. గడప గడపలో దర్యాప్తు జరిపి వారు గెజిట్‌ను రూపొందించారు. ఈ గెజిట్‌లో పుట్టిన బిడ్డ నుంచి 7 సంవత్సరాల వయస్సు ఉన్నవారి పేర్లు కూడా నమోదు చేశారు. ఆ తరువాత కూటమి ప్రభత్వం అధికారంలోకి రావడంతో నష్టపరిహారం రికార్డులను అధికారులు మూలన పడేశారు. ప్రస్తుతం ఆ గెజిట్‌లో నమోదైన వారందరూ 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు దాటిన వారున్నారు. వీరికి కూడా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపచేయాల్సి వస్తుంది.
రూ.కోట్లు దండుకోవటానికి పథకం..
నిర్వాసితులను అడ్డుపెట్టుకొని రూ.కోట్లు దండుకోవటానికి పచ్చనేతలు పథకం వేశారు. ప్రభుత్వం తమదేనన్న అహంకారంతో వారు ఒక్కొక్క లబ్ధిదారుల నుంచి రూ.20 వేల ప్రకారం వసూలు చేస్తున్నట్లు సమాచారం. సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల పంచాయతీల్లో మొత్తం 10,252 నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. వారిలో 3,760 కుటుంబాలు అవార్డ్ పొందాయి. 1,360 కుటుంబాలను పెండింగ్‌లో పెట్టారు. ఈ లెక్కల ప్రకారం పచ్చనేతలు రూ.కోట్లలో వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే గత వారం రోజులుగా దాదాపు 80 మంది నుంచి రూ.16 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఆయా గ్రామాలు ఉన్న లోయ ప్రాంతంలో అవినీతికి అధికారులు, పచ్చనేతలు తెరలేపారు. తమకు రావాల్సిన నష్టపరిహారం కోసం కూడా డబ్బులు చెల్లించాల్సి రావడంతో టీడీపీకి చెందిన బలహీన వర్గాలు మండిపడుతున్నాయి.
ప్యాకేజీ స్కాంను అడ్డుకుంటాం
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల ప్యాకేజీ స్కాంను అడ్డుకుంటాం. అధికారం ఉందని టీడీపీ వర్గీయులు, ప్రాజెక్ట్ అధికారులు తమ ఇష్టం వచ్చినట్లు చేయాలనుకుంటున్నారు. ప్యాకేజీ మంజూరు కావాలంటే రూ.20 వేలు ఇవ్వాలని, లేకుంటే ప్యాకేజీ నిలిపి వేయిస్తామని నిర్వాసితులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం కోట్ల రూపాయలు దండుకోవాలని కూటమి నాయకుడు పథకం వేశాడు. సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల పంచాయతీల్లో 1,360 కుటుంబాలను పెండింగ్‌లో పెట్టారు. వీరికి కూడా అవార్డు రావటానికి పచ్చనేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం గురించి కలెక్టర్, ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాను. నిర్వాసితుల ప్యాకేజీ కోసం జిల్లా గవ్వ చెల్లించాల్సిన అవసరం లేదు. నిర్వాసితులందరికీ తక్షణమే ప్యాకేజీ వర్తింపచేయాలి. అధికారులు స్పందించి సమస్యను సరిదిద్దకుంటే తీవ్ర ఆందోళన చేయటానికి సిద్ధంగా ఉన్నాను.
– తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యే, యర్రగొండపాలెం