
యువకుడి ఉసురు తీసిన ఈత సరదా
గిద్దలూరు రూరల్: ఈతకు వెళ్లిన ఓ యువకుడు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని కొండపేట గ్రామ సమీపంలో గల ఆంజనేయస్వామి గుడి వెనుక సగిలేరు వాగులో మంగళవారం చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన సయ్యద్ ఆసిఫ్(22) స్నేహితులతో కలిసి సగిలేరు వాగులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వాగు లోతట్టు ప్రాంతంలోకి వెళ్లిన ఆసిఫ్ ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. స్నేహితులు గమనించి అతడిని రక్షించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. నీటిలో మునిగిపోయిన ఆసిఫ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న స్థానిక సీఐ కె.సురేష్ తమ సిబ్బందితో కలిసి వాగు వద్దకు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో ఆసిఫ్‌ను బయటకు తీసి చికిత్స నిమిత్తం పోలీస్ వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆసిఫ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువకుడి మృతిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆసిఫ్ తండ్రి రసూల్ అటవీశాఖలో కాంట్రాక్ట్‌బేస్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియెట్ వరకు చదివిన ఆసిఫ్ ఇంటి వద్దనే ఉంటున్నాడు.

యువకుడి ఉసురు తీసిన ఈత సరదా