
ఫ్రిజ్ పేలడంతో రూ.4 లక్షల ఆస్తి నష్టం
కొమరోలు: షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద శబ్ధంతో ఫ్రిజ్ పేలిపోయిన సంఘటన కొమరోలు మండలంలోని రాజుపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. రాజుపాలెం గ్రామానికి చెందిన దద్దనాల చెంచయ్య ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ పేలిపోయింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంటి బయట ఉండటంతో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. అయితే, ఇంట్లోని సామగ్రి అగ్నికి ఆహుతవడంతో రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్లు చెంచయ్య తెలిపారు. సమాచారం అందుకున్న గిద్దలూరు అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
కొండపి: మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొండపి మండల కేంద్రంలోని పొదిలి రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ సమీపంలో చోటుచేసుకుంది. కొండపి ఎస్సై బి.ప్రేమ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ ఆరీఫ్ (22)కు తాను ప్రేమించిన యువతితో మనస్పర్థలు తలెత్తి గొడవలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్‌లో వారు నివసిస్తున్న సమయంలో గొడవల కారణంగా అక్కడి కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లో రిపోర్టు ఇవ్వగా ఆరీఫ్‌కు, ఆ యువతకి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇద్దరికీ ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగా మనస్తాపం చెందిన ఆరీఫ్ శుక్రవారం అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో కొండపిలోని ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని మరణించాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఒంగోలు టౌన్: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నగరంలో పోలీసులు శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండు, డార్మిటరీ, కొత్త కూరగాయల మార్కెట్, పాత కూరగాయల మార్కెట్, రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో తనిఖీలు చేశారు. పేలుడు పదార్థాలు కనుగొనడంలో ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలం చీతా సహాయంతో డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీలలో పాల్గొంది. టాస్క్‌ఫోర్స్, స్పెషల్ పార్టీ బృందం మాదక ద్రవ్యాలు, ఇతర అక్రమ రవాణాను గుర్తించడానికి అనువణువూ పరిశీలన చేశారు. అనుమానం కలిగిన బ్యాగులను పరిశీలించడమే కాకుండా వ్యక్తుల వద్ద గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. తనిఖీలలో ఎస్సై శివరామయ్య, డాగ్ హ్యాండర్ల ప్రభాకర్ పాల్గొన్నారు.