
ఇంటి దొంగలు..!
అటవీశాఖలో
గిద్దలూరు అటవీశాఖ పరిధిలోని
నల్లమల అభయారణ్యం
నల్లమల అటవీ ప్రాంతం
గిద్దలూరు రూరల్:
అటవీశాఖలో ఇంటి దొంగల చేతివాటంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. వీరి సహకారంతోనే అక్రమార్కులు చెలరేగిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. గిద్దలూరు అటవీశాఖ పరిధిలోని నల్లమల అభయారణ్యంలో వేటగాళ్లు, అటవీ సంపదను కొల్లగొట్టే అక్రమార్కుల అడుగులు పడుతుండటంతో అలజడి ఎక్కువైపోతోంది. దుండగులు అభయారణ్యంలోకి ప్రవేశించేందుకు అటవీశాఖలోని ఇంటి దొంగలు సహకరిస్తున్నారని, అధికారులు, సిబ్బంది సైతం అవినీతికి పాల్పడుతూ పట్టించుకోకుండా వదిలేస్తున్నారని పుకార్లు షికారు చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది అనుమతులు లేనిదే అక్రమార్కులు, వేటగాళ్లు అడవిలో అడుగుపెట్టడం వీలుపడదనే వాదన వినిపిస్తోంది.
యథేచ్ఛగా వన్యప్రాణుల వేట...
వేటగాళ్లు సైతం అభయారణ్యంలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తూ వారికి కావాల్సిన జంతువులను వేటాడుతున్నారు. ఇటువంటి సంఘటనలు గతంలో అనేకం జరగ్గా.. ఈ నెల 7వ తేదీ సండ్రపాడు బీటులో ఇద్దరు వేటగాళ్లు నాటుతుపాకీతో అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డారు. 9వ తేదీ రైలులో తరలివెళుతున్న అక్రమ వెదురు కలపను స్వాధీనం చేసుకున్నారు. 2022 నుంచి 2025 వరకు గుండ్లకమ్మ రేంజ్ పరిధిలో దుప్పి, జింక, ఉడుము, కణతి, నెమలి, అడవి పందులు, ఇతర వన్యప్రాణులను వేటాడిన కేసులు 40కిపైగా నమోదయ్యాయి. గిద్దలూరు, తురిమెళ్ల, బేస్తవారిపేట రేంజ్ పరిధిలో 25 కేసులు కలిపి మొత్తం 65 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వేటగాళ్ల చేతిలో గాయపడిన వన్యప్రాణులకు అటవీశాఖ అధికారులు చికిత్స అందించి సురక్షితంగా అభయారణ్యంలో వదిలిన సంఘటనలు అనేకం జరిగాయి.
నామమాత్రంగా వన్యప్రాణుల సంరక్షణ
కార్యక్రమాలు...
ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలను నామమాత్రంగా నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఫలితాలు శూన్యం.
అడవి అక్కడ.. సిబ్బంది ఇక్కడ..!
వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న గిద్దలూరు అభయారణ్యాన్ని సంరక్షించే అటవీశాఖ అధికారులు.. వారికి కేటాయించిన పోస్టులకు సంబంధించిన ప్రాంతాల్లో అందుబాటులో లేకుండా దూరంగా నివాసం ఉండటం వల్ల అటవీ సంరక్షణ కష్టతరం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు గిద్దలూరు అటవీశాఖ పరిధిలో 6 రేంజ్‌లలో ఏబీఓ పోస్టులు 40 ఖాళీగా ఉన్నాయి. ఎఫ్‌బీఓలు 7, ఎఫ్‌ఎస్‌ఓలు 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరత ఉండటం వలన ఉన్న అరకొర సిబ్బందితో అటవీ సంరక్షణ కష్టతరంగా మారింది.
సిబ్బంది కొరతతో అవస్థలు...
ఇసుకగుండం నార్త్, ఈస్ట్, మాలకొండపెంట ఈస్ట్, వెస్ట్, ఓబులేసుపెంట, దిగువమెట్ట ఈస్ట్, వెస్ట్, టన్నల్ బీటు, రాచర్ల, ఆకవీడులో మొత్తం 10 బీట్లకుగానూ గుండ్లకమ్మ రేంజ్‌లో ఏబీఓ పోస్టులు 10, దిగువమ్టెట ఠాణాలో 2 కలిపి మొత్తం 12 ఖాళీగా ఉన్నాయి. ఎఫ్‌బీఓలు 8 మంది పనిచేస్తున్నారు. 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇసుకగుండం, రాచర్ల, మాలకొండపెంట, దిగువమెట్ట బీట్లకు సెక్షన్ ఆఫీసర్లుగా ఎఫ్‌ఎస్‌ఓలు నలుగురు ఉండాల్సి ఉండగా, 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఆర్వోగా ఒకరు విధులు నిర్వర్తిస్తున్నారు.
తురిమెళ్ల, బేస్తవారిపేట రేంజ్‌లలో
8కి 8 ఏబీఓ పోస్టులు ఖాళీ...
గిద్దలూరు రేంజ్ పరిధిలో కొత్తకోట, సండ్రపాడు, బోది, ఎస్.ఆర్.పేట, గడికోట కలిపి మొత్తం 5 బీట్లకుగానూ కొత్తకోటలో మాత్రమే ఏబీఓ పనిచేస్తున్నారు. మిగిలిన నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎఫ్‌బీఓ 1, ఎఫ్‌ఎస్‌ఓ 1 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తురిమెళ్ల రేంజ్‌లో పుల్లలచెరువు, జేబీకే పురం, పాపినేనిపల్లె, బొల్లుపల్లె, వెలగలపాయ, పాపినేనిపల్లె–2, పాపినేనిపల్లె ఠాణాలో 2 కలిపి మొత్తం 8 మంది ఏబీఓలు ఉండాల్సి ఉండగా, అన్ని పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. ఎఫ్‌బీఓలు 9 మంది ఉండాల్సి ఉండగా, 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎఫ్‌ఎస్‌ఓ ఒక్క పోస్టు ఉండగా, ఆ ఒక్కటి ఖాళీగా ఉంది. మూడు డీఆర్‌ఓలకుగానూ ఒక్క పోస్టు ఖాళీగా ఉంది. బేస్తవారిపేట రేంజ్ పరిధిలో తాటిచెర్ల, నల్లగుంట్ల, చింతలపల్లె, జె.పి.చెరువు, చిన్న ఓబినేనిపల్లె, సింగసానిపల్లె, అల్లినగరం, గుంతపల్లిలో 8 ఏబీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎఫ్‌బీఓలు 8 మందికిగానూ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎఫ్‌ఎస్‌ఓలు ముగ్గురు ఉండాల్సి ఉండగా రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఆర్వో ఇన్‌చార్జి రేంజ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.
వారి సహకారంతోనే జోరుగా
కలప అక్రమ రవాణా జరుగుతోందని విమర్శలు
40కిపైగా నమోదైన వన్యప్రాణుల
వేట కేసులు
సిబ్బంది నిర్లక్ష్యానికి వన్యప్రాణులకు
పొంచి ఉన్న ప్రమాదం
పనిచేసే ప్రాంతంలో నివాసం ఉండని అధికారులు, సిబ్బంది
అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు

ఇంటి దొంగలు..!