
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మారం
పామూరు: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనుకోవడం ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఓ కార్యక్రమానికి వెళ్తూ మార్గం మధ్యలో పామూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంకె మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు, పేద విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు ఏకంగా 17 వైద్య కళాశాలలకు అనుమతులు సాధించి నిర్మాణాలు చేపట్టారన్నారు. ఇప్పటికే 7 కళాశాలల నిర్మాణాలు పూర్తికాగా మరో 10 కళాశాలల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయా వైద్య కళాశాలలపై సవతి తల్లి ప్రేమ చూపుతూ వాటి ప్రైవేటీకరణకు మొగ్గుచూపడం అత్యంత హేయమని అన్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ పోరాటాలకు సిద్ధమవుతోందన్నారు. కోటిసంతకాల సేకరణ చేపట్టి గవర్నర్‌కు వినతిప్రతం ఇచ్చే కార్యక్రమం చేపడుతోందని తెలిపారు. కూటమి పాలనా పగ్గాలు చేపట్టిన 15 నెలల్లోనే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోందని, మద్యం బెల్ట్ దుకాణాలతో గ్రామాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, పేదల కుటుంబాలు బజారున పడుతున్నాయని జంకె ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి నాయకులు కల్తీ మద్యంతో కోట్లు దండుకుంటూ ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. అనంతరం జంకెను స్థానిక నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గంగసాని హుసేన్‌రెడ్డి, టీచర్ల విభాగం జిల్లా అధ్యక్షుడు కల్లూరి రామిరెడ్డి, అంబటి కొండారెడ్డి, గట్లా విజయభాస్కర్‌రెడ్డి, పాలేటి ప్రేమ్‌కుమార్, చల్లా సుబ్బారావు, జొన్నలగడ్డ గోవిందయ్య, శ్రీరాం శ్రీనివాసులు, వెలుతుర్ల తిరుపతిరెడ్డి, షేక్ రసూల్, చింతంరెడ్డి బాలిరెడ్డి, కోటపాటి రమణారెడ్డి, వాకమళ్ల కోటిరెడ్డి, తాతిరెడ్డి నరసారెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు,
మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి