
అక్రమంగా కలప తరలింపుతో బిక్కుబిక్కుమంటున్న వన్యప్రాణుల
గిద్దలూరు అటవీశాఖ పరిధిలో గుండ్లకమ్మ రేంజ్, తురిమెళ్ల రేంజ్, బేస్తవారిపేట రేంజ్, గిద్దలూరు రేంజ్, స్క్వాడ్ రేంజ్, డీఈటీ రేంజ్ కలిపి మొత్తం 6 రేంజ్‌లకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఉన్నారు. అందులో గిద్దలూరు రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డి స్క్వాడ్ రేంజ్‌కి ఇన్‌చార్జిగా, గుండ్లకమ్మ రేంజ్ ఆఫీసర్ నరసింహారావు డీఈటీ రేంజ్‌కి ఇన్‌చార్జిగా, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆనందరావు బేస్తవారిపేట రేంజ్‌కి ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిద్దలూరు అటవీశాఖ పరిధిలో అభయారణ్యం సుమారు 10 వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. గిద్దలూరు రేంజ్‌లోని గుండ్లమోటు, గుండ్లకమ్మ రేంజ్ పరిధిలోని కుక్కలగుండం, ఇసుకల గుండం నుంచే కాకుండా నంద్యాల జిల్లా పచ్చర్ల అటవీప్రాంతం నుంచి సైతం అక్రమంగా వెదురు, ఇతర కలప తరలిస్తున్నారు. అక్రమంగా కలప తరలించే వారు అభయారణ్యంలో ఎలా అడుగు పెడుతున్నారు.. అక్రమంగా కలప ఎలా తరలిస్తున్నారనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. కలప, వెదురు నరికే వారి గొడ్డలి చప్పుళ్లకు వన్యప్రాణులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నాయి.