
డ్రోన్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి
ఒంగోలు టౌన్: డ్రోన్ పెట్రోలింగ్‌ను ముమ్మరంగా నిర్వహించాలని, జిల్లాలోని అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసు అధికారులు తరచూ గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకం కావాలని, గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజుతో కలిసి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత నేర పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మహిళలపై జరిగే నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్థిక నేరాలలో టాప్ 10 స్థానాలలో ఉన్న వారిపై నిఘా ఉంచాలన్నారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా తయారీ, విక్రయాలు, నిల్వలపై దృష్టి సారించాలని చెప్పారు. నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ఒంగోలు డీఎస్సీ శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, మార్కాపురం డీఎస్సీ నాగరాజు, కనిగిరి డీఎస్సీ సాయిఈశ్వర్ యశ్వంత్, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్సీ రమణ కుమార్, సీఐలు పాల్గొన్నారు.