
పార్టీ అండగా ఉంటుంది
భయం వద్దు..
● వైఎస్సార్ సీపీ శ్రేణులకు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి భరోసా
ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వ వేధింపులకు వైఎస్సార్ సీపీ శ్రేణులెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి భరోసా ఇచ్చారు. వినాయకుని నిమజ్జనంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాటలు పెట్టారనే అక్కసుతో ఒంగోలు 45వ డివిజన్‌కు చెందిన వైఎస్సార్ సీపీ వర్గీయులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి అక్రమ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపగా, బెయిల్‌పై బయటకు వచ్చిన వారు గురువారం వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. నిమజ్జనం రోజు ఏం జరిగిందో వైవీకి వివరించారు. మహిళల పట్ల కూడా పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, 50 మందికిపైగా వైఎస్సార్ సీపీ వారిపై అక్రమ కేసు బనాయించారని తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీకి ప్రజల్లో పెరుగుతున్న బలాన్ని చూసి భయపడుతున్న కూటమి పాలకులు వైఎస్సార్ సీపీ శ్రేణులను భయాందోళనకు గురి చేసే విధంగా పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అక్రమ కేసులో బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, లీగల్ సెల్ న్యాయవాదులు పెన్నా నాగరాజు, ధర్నాసి హరిబాబు, జయచంద్రనాయక్, అలికేపల్లి యగ్నేశ్వరరెడ్డి, కోడూరి రవిబాబును వైవీ సుబ్బారెడ్డితో పాటు పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు అభినందించారు. వారి వెంట వైఎస్సార్ సీపీ నాయకుడు వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, కార్పొరేటర్ వెన్నపూస కుమారి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రవణమ్మ ఉన్నారు.