
బోధనేతర కార్యక్రమాలకు మినహాయింపు ఇవ్వండి
ఒంగోలు సిటీ: ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఫ్యాప్టో నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్ ఆదిలక్ష్మి, డీఆర్‌ఓ ఓబులేసుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి బోధనేతర పనులు, విద్యాశక్తి కార్యక్రమం బహిష్కరిస్తున్నామని తెలిపారు. విద్యారంగంలో మితిమీరిన బోధనేతర కార్యక్రమాలతో బోధనా సమయం హరించుకుపోతోందన్నారు. ఉపాధ్యాయులకు కూడా బోధనపై ఆసక్తి తగ్గేలా బోధనేతర కార్యక్రమాలు పెరిగిపోయాయని, పలు దఫాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం సంబంధించిన పనులు మాత్రమే ఉపాధ్యాయులు చేపడతారని, మూల్యాంకనానికి సంబంధించి పరీక్షల నిర్వహణ తప్ప ఏ ఇతర బోధనేతర పనులను గానీ, అనవసరమైన గూగుల్ షీట్స్ నింపడం గాని, విద్యా శక్తి, జీఎస్టీ 2.0 లాంటి సీజనల్ ప్రచార కార్యక్రమాలను చేపట్టమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఫ్యాప్టో చైర్మన్ కె.ఎర్రయ్య ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ షేక్ అబ్దుల్ హై, ఫ్యాప్టో కో చైర్మన్ వి.మాధవరావు, సభ్యులు డి.శ్రీనివాసులు, పీవీ సుబ్బారావు, జి.ఉమామహేశ్వరి, సీహెచ్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.