
ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేయాలి
● కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు వన్‌టౌన్: ఉపాధి కల్పనే లక్ష్యంగా సంబంధిత శాఖలు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ పీ రాజాబాబు అధికారులను ఆదేశించారు. నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కల్పనపై బుధవారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పరిస్థితులకు అనుగుణంగా యువతకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కల్పించి ఉపాధి మార్గం చూపించాలన్నారు. సెర్ప్, మెప్మా, నైపుణ్యాభివృద్ధి విభాగాలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు మరింత చురుకై న పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు. సెర్ప్, మెప్మా పొదుపు సంఘాలలోని మహిళలు ఇప్పటికే జీవనోపాధి కోసం వివిధ వృత్తులు చేస్తున్నారని, వారికి అవసరమైన నైపుణ్యాభివృద్ధిని కల్పించడం ద్వారా వారి వద్ద మరింత మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పొదుపు సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. రెండు గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని సంయుక్తంగా మినీ డైరీ ఫారాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా మెప్మా ద్వారా ఉపాధి కల్పిస్తున్న, భవిష్యత్తు అవకాశాలను తెలుపుతున్న బ్రోచర్‌ను సమావేశంలో కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ నారాయణ, మెప్మా పీడీ శ్రీహరి, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రవితేజ, ఉపాధి కల్పన అధికారి రమాదేవి, రూడ్ సెట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ, జెడ్పీ సీఈవో చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఇన్చార్జి రజనీ కుమారి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.