
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
● నంద్యాల ఫారెస్టు కన్జర్వేటర్ విజయకుమార్
మార్కాపురం: వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నంద్యాల అటవీశాఖ కన్జర్వేటర్ సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి విజయ్‌కుమార్, సబ్‌కలెక్టర్ త్రివినాగ్ అన్నారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా బుధవారం మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం అనంతరం, ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి బాగుండాలంటే అడవులను సంరక్షించుకోవాలని, వాటితోపాటు అందులో జీవించే వివిధ రకాల వన్యప్రాణులను కూడా కాపాడినప్పుడే ప్రకృతి సమతుల్యత బాగుంటుందని అన్నారు. అవగాహన లేక పలువురు అటవీ ప్రాంతంలోకి వేటకు వెళ్లి వన్యప్రాణులను చంపుతున్నారని, ఇది సహించరాని నేరమని అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద జైలుకు పంపుతామని హెచ్చరించారు. మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులులు, చిరుతలు, జింకలు, ఎలుగుబంట్లు, దుప్పులు, నెమళ్లు పలురకాల వన్యప్రాణులు ఉన్నాయని, ఇవి పొరపాటున జనావాసాల్లోనికి వస్తే వాటిపై రాళ్లు విసిరి చంపకుండా తమకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణపై పలువురు విద్యార్థినులు మాట్లాడారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వన్యప్రాణులను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గిద్దలూరు, నంద్యాల అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్లు నిషాకుమారి, అనురాగ్ మీనా, మార్కాపురం డీఎస్పీ డాక్టర్ నాగరాజు, శ్రీశైలం, నంద్యాల సబ్‌డీఎఫ్‌ఓలు బాలరాజు, భవిత కుమారి, ఎఫ్‌ఆర్‌ఓ పిచ్చిరెడ్డి, డీఆర్‌ఓ నాగరాజు గౌడ్, హెచ్‌ఎం శ్రీదేవీ తదితరులు పాల్గొన్నారు.