పాతాళంలో పొగాకు ధరలు | - | Sakshi
Sakshi News home page

పాతాళంలో పొగాకు ధరలు

Oct 9 2025 2:47 AM | Updated on Oct 9 2025 9:42 AM

పొగాక

పొగాకు ధరలు

చీమకుర్తి: పొగాకు రైతుల ఆశలు రోజురోజుకూ ఆవిరవుతున్నాయి. పొగాకు కొనుగోళ్లలో బ్రైట్‌ పొగాకు కేజీ ధర గరిష్టంగా రూ.346 పలికింది. ఇప్పుడు అది రూ.315కు పడిపోయింది. సరాసరిన రూ.234 వద్ద నిలిచింది. లోగ్రేడ్‌ పొగాకు మొదట్లో గరిష్టంగా కేజీ రూ.160– రూ.170 మధ్య పలికింది. నేడు కనిష్ట ధర రూ.69కు పడిపోయింది. ధరలు పెరుగుతాయేమోనని ఇన్నాళ్లు కోల్డ్‌స్టోరేజీల్లో దాచిన పొగాకును వేలం కేంద్రాల్లోకి తీసుకొచ్చి విక్రయిస్తుంటే బయ్యర్లు వేస్తున్న ధరలు చూసి రైతులు అక్కడికక్కడే కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. నాలుగేళ్ల పాటు పొగాకు రైతులకు స్వర్ణయుగంగా గడిచింది. ఈ ఏడాది మాత్రం రైతులు జీవితంలో మర్చిపోలేని విధంగా దారుణమైన ధరలు పలుకుతుండటంతో పెట్టిన పెట్టుబడులు రాక అప్పులు ఎలా తీర్చాలో, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని ఎలా విడిపించుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు. లోగ్రేడ్‌ పొగాకు క్వింటా రూ.6 వేల నుంచి రూ.7 వేలు పలుకుతుంటే ఇక కోలుకునేది ఎక్కడని రైతులు ఆందోళన చెందుతున్నారు.

లోగ్రేడ్‌ కొనే దిక్కు లేదు...

హైగ్రేడ్‌ పొగాకు ధరలు క్రమంగా తగ్గుస్తూ వస్తుండగా మరోపక్క లోగ్రేడ్‌ పొగాకును కొనుగోలు చేసేందుకు వ్యాపారులు అసలు ముందుకే రావడం లేదు. లోగ్రేడ్‌ పొగాకు కేజీ ప్రస్తుత ధర రూ.69లకు పడిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయినా సరే లోగ్రేడ్‌ పొగాకును కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోగ్రేడ్‌ బేళ్లను వేలం కేంద్రాలకు తీసురావడం.. అమ్ముడుపోక తిరిగి ఇంటికి తీసుకెళ్లడం రైతులకు పరిపాటిగా మారిపోయింది. దీని వల్ల రైతులపై రవాణా చార్జీలు, వెయిట్‌లాస్‌ రూపం మరింత నష్టం వస్తోంది. ఒకసారి వేలం కేంద్రానికి తీసుకురావాలంటే ఒక బేల్‌కి రూ.200ల ఖర్చవుతుండగా, శాంపిల్స్‌ రూపంలో బేల్‌కి ఐదారు కేజీల పొగాకును నష్టపోతున్నారు. ఇలా రెండు మూడు సార్లు వేలం కేంద్రాలకు బేళ్లను తీసుకురావడం వల్ల రైతులకు అదనపు భారంగా మారుతోంది. దీని వల్ల ప్రస్తుతం ఈ ఏడాది పొగాకు రైతులకు సాగు ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

122 మిలియన్‌ కేజీల పొగాకు కొనుగోళ్లు పూర్తి

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మొత్తం 11 వేలం కేంద్రాల పరిధిలో మొత్తం 104.6 మిలియన్‌ కేజీల పొగాకును కొనుగోలు చేస్తామని బోర్డు అధికారికంగా నిర్ధారించగా రైతులు పరిమితికి మించి సాగు చేయటంతో అది కాస్త 158.6 మిలియన్‌ కేజీలకు పెంచింది. దానిలో ఇప్పటి వరకు 122 మిలియన్‌ కేజీల పొగాకు (78 శాతం)ను కొనుగోలు చేసింది. రైతుల వద్ద ఇంకా కొనుగోలు చేయాల్సిన పొగాకు 35 మిలియన్‌ కేజీల పొగాకు నిల్వలు ఉన్నాయి.

దానిలో భాగంగానే పొగాకు నారు మడులను నిర్వహించే రైతుల వద్ద నుంచే ఆంక్షలు మొదలు పెట్టి పొగాకు సాగును నియంత్రిస్తున్నారు. అందుకనుగుణంగానే పొగాకు నారుమడులు పెట్టుకునే వారు ముందుగానే పొగాకు బోర్డు అధికారుల వద్ద అనుమతి తీసుకొని వారు నిర్ణయించిన మేరకే పొగనారుమడులను సాగు చేయాలనే ఆంక్షలు విధిస్తున్నారు. దాంతో రైతులు ఇప్పటి నుంచి పొగాకు సాగు విస్తీర్ణం తగ్గించుకొని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని బోర్డు అధికారులు ఊరూరు తిరిగి అవగాహన కల్పిస్తున్నారు.

158 మిలియన్‌ కేజీల నుంచి 90 మిలియన్‌ కేజీలకు తగ్గింపు

ఈ ఏడాది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 158 మిలియన్‌ కేజీల పొగాకు రైతులు సాగు చేయగా వచ్చే ఏడాది దానిని 90 మిలియన్‌ కేజీలకు తగ్గించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పొగాకు ఉండే గిట్టుబాటు ధరలు, పొగాకు కంపెనీల అవసరాలను బట్టి రైతులు నష్టపోకుండా ఉండాలంటే ఈ ఏడాది అనుమతినిచ్చిన 158 మిలియన్‌ కేజీలను వచ్చే ఏడాదికి 90 మిలియన్‌ కేజీలకు తగ్గించినట్లు బోర్డు అధికారులు ఇప్పటికే రైతులకు అవగాహన సదస్సులు పెట్టి వివరిస్తున్నారు. దాని ప్రకారం నల్లరేగడి నేలల పరిధిలో ఒక్కో బ్యారన్‌కు గతంలో 5.56 ఎకరాల్లో సాగుకు, 41.75 క్వింటాళ్లకు అనుమతినిచ్చేవారు. దానిని ఇప్పుడు వచ్చే ఏడాదికి 4.75 ఎకరాలకు పరిమితం చేసి 35.65 క్వింటాళ్లకు మించి ఉత్పత్తి పెంచకూడదని బోర్డు నిర్ణయించింది. తేలిక రకం నేలల్లో గతంలో 8.42 ఎకరాల్లో సాగు చేసే పరిస్థితి నుంచి 7.25 ఎకరాలకు పరిమితం చేశారు. 42.75 క్వింటాళ్ల నుంచి 36.65 క్వింటాళ్లకు పొగాకు ఉత్పత్తిని తగ్గించారు.

లోగ్రేడ్‌ పొగాకు ధరలు పతనమయ్యాయి

పొగాకు లోగ్రేడ్‌ రకం క్వింటా రూ.7 వేలకు పడిపోయింది. రైతులు పొగాకు మీద పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. చేసేది లేక బయ్యర్లు అడిగిన ధరకు ఇష్టమున్నా, లేకున్నా వేలం కేంద్రాల్లో రైతులు వదిలేసి పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు.

– సూరం గురవారెడ్డి, పేర్నమిట్ట

ఇప్పటి వరకు 122 మిలియన్‌ కేజీలను కొనుగోలు చేశాం

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 122 మిలియన్‌ కేజీల పొగాకును బోర్డు ద్వారా కొనుగోలు చేశాం. రైతుల వద్ద ఇంకా మరో 35 మిలియన్‌ కేజీల పొగాకు ఉండొచ్చు. దానిని వచ్చే నెలలోపు కొనుగోళ్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే ఏడాదికి పొగాకు ఉత్పత్తిని 90 మిలియన్‌ కేజీలకు పరిమితం చేశారు.

– ఎస్‌.రామారావు, ఆర్‌ఎం, ఒంగోలు

పొగాకు ధరలు1
1/1

పొగాకు ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement