
పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు సిటీ: ఒంగోలులోని డీ.ఎస్.గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ (ఆటోనమస్), ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఆర్‌సెట్ 2024–25) నోటిఫికేషన్ విడుదలైందని, ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, వాటికి అనుబంధ ఉన్నత విద్యాసంస్థల్లో పీహెచ్‌డీ (డాక్టరల్ డిగ్రీ) ప్రోగ్రాంలకు ఫుల్ టైమ్, పార్ట్‌టైమ్ మోడ్‌లలో ప్రవేశాలు ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.డి.కల్యాణి, రీసెర్చ్ కోఆర్డినేటర్ డా.ఎం.శ్రీనివాస రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కళ్యాణి మాట్లాడుతూ పరీక్షలు వచ్చే నెల 3 నుంచి 7వ తేదీ వరకు వరకు నిర్వహిస్తారన్నారు. అర్హత గల అభ్యర్థులు హెచ్‌టీటీపీఎస్://సీఈటీఎస్.ఏపీఎస్‌సీహెచ్‌ఈ.ఎపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న డీ.ఎస్.గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు (పుల్‌టైమ్, పార్ట్‌టైమ్) అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రీసెర్చ్‌లో ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఏపీ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కాలేజీ అనుభవజ్ఞులైన పరిశోధనా మార్గదర్శకులు, లైబ్రరీ, ల్యాబ్ సదుపాయాలతో మహిళా పరిశోధకుల కోసం ఒక సురక్షితమైన, ప్రోత్సాహకరమైన అకడమిక్ వాతావరణాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
ఒంగోలు సిటీ: జిల్లాలో 35 ఎయిడెడ్ పాఠశాలలకు విద్యాశాఖ కమిషనర్ నోటీసులు జారీ చేసినట్లు ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్.ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో జిల్లాలో జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న 17 ఎయిడెడ్ పాఠశాలలకు 30 డిసెంబర్ 2024న నోటీసులు జారీ చేశారన్నారు. ప్రస్తుతం 35 ఎయిడెడ్ పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. మొత్తం జిల్లాలో 52 ఎయిడెడ్ పాఠశాలలు ఏప్రిల్ 23, 2026 నాటికి మూతపడనున్నాయని తెలిపారు. ఈ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేస్తామని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. అయితే జిల్లాలో ప్రస్తుతం వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో పాటు ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు సీనియార్టీ జాబితా తయారుచేసి కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం 98 ఎయిడెడ్ పాఠశాలల్లో 106 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, 2026 ఏప్రిల్ నాటికి 46 ఎయిడెడ్ పాఠశాలలే మిగులుతాయని తెలిపారు.
ఒంగోలు వన్‌టౌన్: దీపావళి పండుగ సమయానికి జిల్లాలో 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ పీ రాజాబాబు హౌసింగ్ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ అధికారులతో ప్రకాశం భవన్‌లోని తన చాంబర్‌లో బుధవారం సమీక్ష సమావేశం కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ స్కీములో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పీఎంఏవై, పీఎం జన్‌మన్ పథకాల కింద జిల్లాలో మంజూరైన ఇళ్లు, నిర్మాణం పూర్తయినవి, పురోగతిలో ఉన్నవి, ఇంకా ప్రారంభం కానివి, స్థానిక పరిస్థితులపై నియోజకవర్గాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా హౌసింగ్ పీడీ పి.శ్రీనివాస ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరాలు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ పూర్తయిన నిర్మాణ దశలను బట్టి ప్రభుత్వం వెంటనే బిల్లులు విడుదల చేస్తున్నందున లబ్ధిదారులందరూ త్వరగా పూర్తి చేసుకునేలా నిరంతరం పర్యవేక్షించాలని దిశా నిర్దేశం చేశారు. జిల్లాకు 8839 ఇళ్ల నిర్మాణాల టార్గెట్ ఇచ్చినట్లు పీడీ తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ లక్ష్యాన్ని పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, హౌసింగ్ స్కీములో ఆప్షన్ 3 కింద లబ్ధిదారులుగా ఉన్నవారికి కూడా కాంట్రాక్టర్లు త్వరగా ఇళ్లు నిర్మించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. స్పష్టమైన పురోగతి లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సమావేశంలో హౌసింగ్ ఈఈలు, డీఈఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.