
ఉపసంహరించుకోండి
13 గంటల పనిదినాన్ని
ఒంగోలు టౌన్: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పని గంటలను 8 నుంచి 13 గంటలకు పెంచడం దుర్మార్గమని, వెంటనే 13 గంటల పనిదినాన్ని ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. పనిగంటలు పెంచుతూ ఆమోదించిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ బుధవారం నగరంలోని ఆర్టీసీ డిపో సెంటర్‌లో సీఐటీయూ, ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పని చేస్తున్న కూటమి ప్రభుత్వం కార్మికుల శ్రమశక్తిని దోచుకునే విధంగా పని గంటలను 8 నుంచి 13 గంటలకు పెంచిందని ఆరోపించారు. ఎన్నో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని కాలరాసి తీసుకొచ్చిన పనిగంటల పెంపును మొత్తం కార్మిక లోకం వ్యతిరేకిస్తోందని చెప్పారు. కార్మికులు సాధించుకున్న 29 లేబర్ చట్టాలను 4 లేబర్ కోడ్స్‌గా మార్చి అమలు చేస్తోందని, అందులో భాగంగానే 13 గంటల పనిదినాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో పట్టపగలే రక్షణ లేకుండా పోయిన నేపథ్యంలో రాత్రి పూట మహిళలతో పనులు చేయించాలనుకోవడం వివేకం అనిపించుకోదని విమర్శించారు. దీనివలన మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా వారి హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థల అనుకూల విధానాలపై కార్మికులు, ఉద్యోగులతో కలిసి ఐక్య పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పి.కల్పన, బాలకోటయ్య, కేఎఫ్ బాబు, కనపర్తి సుబ్బారావు, యం.రమేష్, కాలం సుబ్బారావు, చీకటి శ్రీనివాసరావు, కుమారి, శేషయ్య, కె.వెంకటేశ్వర్లు, బీవీ రావు తదితరులు పాల్గొన్నారు.