లక్ష మందితో జగనన్న దళిత ఫోర్స్‌ | - | Sakshi
Sakshi News home page

లక్ష మందితో జగనన్న దళిత ఫోర్స్‌

Oct 8 2025 6:41 AM | Updated on Oct 8 2025 6:41 AM

లక్ష మందితో జగనన్న దళిత ఫోర్స్‌

లక్ష మందితో జగనన్న దళిత ఫోర్స్‌

వారం రోజుల్లో గ్రామ స్థాయి కమిటీలు సిద్ధం చేయాలి ప్రజా సమస్యలపై జరిగే పోరాటాల్లో ఎస్సీ సెల్‌ నాయకులు భాగస్వాములు కావాలి పార్టీ నాయకులందరినీ సమన్వయం చేసుకొని అంకితభావంతో పనిచేయాలి చంద్రబాబు పాలనలో ఏడాదిన్నరలోనే దళితులకు రూ.20 వేల కోట్ల నష్టం జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడమే దళితుల లక్ష్యం కావాలి జిల్లా ఎస్సీ సెల్‌ సమీక్ష సమావేశంలో ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు

ఒంగోలు టౌన్‌: రాష్ట్రంలోని 16 వేల గ్రామ పంచాయతీలు, 660 మండలాలు, 17 నగర పాలక సంస్థల నుంచి లక్ష మందితో జగనన్న దళిత ఫోర్స్‌ ఏర్పాటు చేసి మెగా సమావేశాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌బాబు చెప్పారు. జిల్లా వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మంగళవారం ఎస్సీ సెల్‌ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ సెల్‌ జిల్లా, నియోజకవర్గ నాయకులకు దిశానిర్దేశం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. వారం రోజుల్లోపే గ్రామ స్థాయి కమిటీలు వేయడానికి సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి క్రీయాశీలకంగా వ్యవహరించే ఇద్దరు నాయకుల పేర్లను సూచించాలని కోరారు. అందులోంచి ఒకరిని మండల కమిటీకి ప్రతిపాదిస్తారని, మరొకరిని గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తారని వివరించారు. వీరందరితో త్వరలోనే జిల్లా ఎగ్జిక్యూటివ్‌ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన కమిటీలతో కేంద్ర కార్యాలయంలో మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎస్సీ సెల్‌ నాయకులకు తగిన ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీలకు సరైన ప్రాముఖ్యత ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అన్నీవర్గాల నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. పార్టీ అధినేత ఆదేశాలను, జిల్లా అధ్యక్షుడి సూచనలు సలహాలను, ఇన్‌చార్జిల సహకారాన్ని తీసుకొని క్షేత్ర స్థాయిలో పనిచేయాలని చెప్పారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు నిబద్ధతగా పనిచేయాలని, పార్టీకి ఎస్సీ సెల్‌ ప్రాణవాయువులా పనిచేయాలని కోరారు.

చంద్రబాబు పాలనలో దళితులకు అన్యాయం:

చంద్రబాబు కూటమి పాలనలో రాష్ట్రంలోనే దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని సుధాకర్‌ బాబు ఆరోపించారు. చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో ఎస్సీలకు రూ.20 వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో దళితులకు ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు. ఉచిత బస్సుల పథకంలో రోజూ ప్రయాణించే మహిళలు ఎవరు, వారి సామాజిక వర్గాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఉచిత బస్సుల్లో ప్రయాణించే వారిలో మాల, మాదిగ, రెల్లి, పైడి కులాలకు చెందిన మహిళలు ఎంతమంది ఉన్నారో చెప్పాలని నిలదీశారు. ఉచిత బస్సు పథకంతో దళితులకు జరిగే మేలు ఏమీ లేదని వివరించారు. ఇప్పటికే దళిత బిడ్డలు చదువుకుంటున్నారని కక్ష కట్టి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియం తీసేశారని, అమ్మ ఒడి లేదు, చేయూత లేదని చెప్పారు. రాష్ట్రంలో లక్ష పింఛన్లను తొలగించారని, అందులో 50 వేల పింఛన్లు దళితులకు చెందినవే ఉన్నాయన్నారు. ఉచిత గ్యాస్‌ పథకం కూడా దళితులకు పూర్తిగా వర్తించదని, గ్యాస్‌ సిలిండర్లు వాడేవారిలో ఎక్కువగా దళితులు లేరని, కట్టెలు తెచ్చుకొని పొయ్యిలో వంట చేసుకునే వారే అత్యధికంగా ఉన్నారని చెప్పారు. ఆటో డ్రైవర్లలో ఎంత మంది ఎస్సీలు ఉన్నారో లెక్క తేల్చాలని డిమాండ్‌ చేశారు. జగనన్న పాలనలో వివిధ పథకాల ద్వారా రూ.70 వేల కోట్లను దళితులకు అందజేశారని తెలిపారు. జగనన్న మంజూరు చేసిన 17 మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణమన్నారు. అవే కనుక ప్రభుత్వ నిర్వహిస్తే అందులో ఉచితంగా వైద్య సేవలను పొందేవారిలో దళితులే ఎక్కువగా ఉంటారని, మెడికల్‌ కాలేజీల్లో దళిత బిడ్డలు చదువుకునేవారని చెప్పారు. అందుకే కక్షకట్టి మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నాడని ఆరోపించారు. అయినప్పటికీ ప్రైవేటు మెడికల్‌ కాలేజీల జీవో రద్దు చేసేంత వరకు జగనన్న ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబును గద్దె దింపడమే దళితుల ఏకై క లక్ష్యమన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు జి.దేవ ప్రసాద్‌, ఒంగోలు నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కె.దానియేలు, దర్శి నియోజకవర్గ అధ్యక్షుడు జి.యేసుదాసు, కొండపి నియోజకవర్గ అధ్యక్షుడు చుక్కా కిరణ్‌ కుమార్‌, మార్కాపురం నియోజకవర్గ అధ్యక్షుడు ఏ.లూక్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీలు దుడ్డు వినోద్‌ కుమార్‌, బి.ప్రవీణ్‌ కుమార్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్‌ ఒంగోలు సీటీ అధ్యక్షుడు పి.గోపిచంద్‌, నాయకులు కె.డేవిడ్‌, డి.రమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement