
పాలుట్లకు రవాణా సౌకర్యం కల్పించండి
● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలుట్ల గిరిజన గూడెంకు రవాణా సౌకర్యంలేక ఆ ప్రాంతం గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మండలంలోని గాంధీనగర్ నుంచి పాలుట్లకు రోడ్డు ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఓఎస్‌డీ కె.వెంకటకృష్ణకు అర్జీ అందజేశారు. పాలుట్లలో 200కు పైబడి కుటుంబాలు నివశిస్తున్నాయని, వారందరూ వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వారు పండించిన పంటలకు రవాణా సౌకర్యంలేక సకాలంలో తమ పంటలను మార్కెటింగ్ చేసుకోలేక పోతున్నారని ఆ అర్జీలో పేర్కొన్నారు. అంతేకాకుండా మండల కేంద్రమైన యర్రగొండపాలెంకు నిత్యం విద్యార్థులు, రైతులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుండాలని, వైద్యం కోసం దాదాపు 40 కిలో మీటర్లు రావల్సి ఉంటుందని, రోడ్డు సౌకర్యంలేక గర్భిణులు, దీర్ఘ వ్యాధిగ్రస్తులు మెరుగైన వైద్యానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. గత 20 సంవత్సరాలుగా రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజన గూడెం వాసులు కోరుతున్నా ఫారెస్ట్ క్లియరెన్స్ చేయలేక పోయారని, వెంటనే డిప్యూటీ సీఎం స్పందించి పాలుట్ల గిరిజన గూడెంకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, అందుకు ఫారెస్ట్ క్లియరెన్స్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, పుల్లలచెరువు మండల మాజీ ఎంపీపీ మార్తాల సుబ్బారెడ్డి, సర్పంచ్‌లు టి.సత్యనారాయణరెడ్డి, ఎ.వీరవెంకట కోటిరెడ్డి, ఆవుల రమణారెడ్డి, సురేష్ నాయక్ ఉన్నారు.
తాళ్లూరు: మండలంలోని మాధవరం గ్రామంలో ప్రసిద్ధ గాంచిన గంగా పార్వతి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పౌర్ణమి కావడంతో సూర్యకిరణాలు గర్భగుడి నుంచి నేరుగా స్వామి వారి మూలమూర్తిని తాకాయి. ఏటా కార్తీక మాసానికి ముందు వచ్చే పౌర్ణమి, మళ్లీ కార్తీక పౌర్ణమి రోజున, శివరాత్రి రోజున ఇలా జరుగుతుందని ఆలయ పూజారి తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతోలతో పూజలు నిర్వహించారు.