
వాల్మీకి జీవితం ఆదర్శనీయం
● జయంతి కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: మానవాళికి రామాయణం లాంటి మహత్తరమైన కావ్యాన్ని అందించిన మహానుభావుడు మహర్షి వాల్మీకి అని, ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాల్మీకి రచించిన రామాయణం నేడు యావత్ ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. మహనీయుల జయంతులు, ఉత్సవాలు నిర్వహించుకోవడమంటే కేవలం వారిని స్మరించుకోవడమే కాదని, వారు అందించిన సేవలను ప్రజలకు తెలియజెప్పాలన్నారు. అన్నదమ్ముల మధ్య సంబంధం ఎలా ఉండాలి, కుటుంబ బాంధవ్యాలు ఎలా ఉండాలి, సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ధర్మం వైపు నిలిచి ఉండటం ఎలా అనే విషయాలను సమాజానికి తన కావ్యం ద్వారా తెలియజేసిన మహోన్నతుడు వాల్మీకి అని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి నిర్మల జ్యోతి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, పలు బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పొన్నలూరు: గేదె కోసం వాగులో దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన పొన్నలూరు మండలం రాజోలుపాడులో మంగళవారం జరిగింది. కుటుంబసభ్యులు, స్థానికుల తెలిపిన వివరాలు మేరకు..గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎలికా దేవదాస్(45) రోజు మాదిరిగానే తన గేదెలను కాసుకోవడానికి పొలం వెళ్లాడు. గేదెలు గ్రామ శివారులో ఉన్న నీటి వాగులోకి దిగాయి. వీటిని బయటకు తోలే క్రమంలో దేవదాస్ కూడా వాగులోకి దిగాడు. అయితే వాగు లోతుగా ఉండి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. దేవదాస్ వాగులో దిగినట్లు ఆనవాళ్లు ఉండటంతో ఈత రాక మృతి చెందినట్లు బంధువులు నిర్ధారించుకొని మృతదేహం కోసం వాగులో గాలిస్తున్నారు.
ఉరి వేసుకొని
యువకుడి మృతి
ఒంగోలు టౌన్: నగరంలోని మంగమూరు డౌనులో ఉన్న ఒక బేకరిలో పని చేసే కార్మికుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. సీఎస్‌పురం మండలం అరివేముల గ్రామానికి చెందిన చల్లగాలి బాబు (19) గత కొంత కాలంగా నగరంలోని మంగమూరు సెంటర్లో గల ఒక బేకరిలో పనిచేస్తున్నాడు. బేకరిలోని ఒక గదిలోనే ఉంటాడు. సోమవారం రాత్రి పని చేసిన బాబు అదేరోజు రాత్రి గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మరణించాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఫ్లయ్‌ఓవర్ బ్రిడ్జి మీద శవం...
నగరంలోని సౌత్ బైపాస్ హైవే ఫ్లయ్‌ఓవర్ బ్రిడ్జి మీద ఒక గుర్తు తెలియని శవాన్ని హైవే పోలీసులు గుర్తించారు. మంగళవారం తెలవారుజామున 7 గంటల సమయంలో మృతదేహం బ్రిడ్జి మీద పడినట్లు భావిస్తున్నారు. ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీ కొడితే మరణించాడో, లేక ఏదైనా వాహనం నుంచి జారి పడి మరణించాడో స్పష్టంగా తెలియడం లేదు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వాల్మీకి జీవితం ఆదర్శనీయం