
ట్రేడింగ్ యాప్ పేరుతో ఘరానా మోసం
● ఫేస్‌బుక్, వాట్సప్ గ్రూప్‌లో మహిళ చాటింగ్
● ట్రేడింగ్ పేరుతో రూ.1.16 కోట్లు దండుకుని మోసం చేసిన వైనం
● కనిగిరిలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
కనిగిరిరూరల్: రోజుకో కొత్త సైబర్ మోసం వెలుగులోకి వస్తోంది. ఇటీవల కనిగిరి పట్టణానికి ఓ ఉపాధ్యాయుడు డిజిటల్ మోసానికి గురై రూ.32 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన మరవక ముందే కొత్తగా పట్టణానికి చెందిన ఓ షోరూం వ్యాపారి ట్రేడింగ్ యాప్ మోసానికి గురై రూ.1.16 కోట్లు మోసపోయాడు. బాధితుడు పరువు పోతుందని భావించి గుట్టుచప్పుడు కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు మంగళవారం రాత్రి సీఐ ఎస్‌కే ఖాజావలి విలేకరులకు వివరాలు వెల్లడించారు. ట్రేడింగ్ యాప్ పేరుతో ఫేస్‌బుక్, వాట్సప్‌ల ద్వారా పరిచయం చేసుకుని, ముందుగా మంచి ప్రాపర్టీలు చూపించి ఆశ పెట్టి.. యాప్‌లో డబ్బులు పెట్టించి, చాటింగ్ చేస్తూ.. మోసం చేస్తున్నట్లు తెలిపారు. ఈ తరహా పద్ధతిలో పట్టణానికి చెందిన ఓ వ్యాపారికి మోసపోయినట్లు చెప్పారు. ఫేస్‌బుక్‌లో ట్రెడింగ్ యాప్‌లో ఓ మహిళ పరిచయమై, ఆ తర్వాత వాట్సప్ గ్రూప్ పెట్టి ట్రేడింగ్ చేస్తూ రూ.1.16 కోట్లు మోసం చేసినట్లు వెల్లడించారు. బాధితుడు ఇటీవల తమకు ఫిర్యాదు చేశారన్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు
● కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: జిల్లాలో భూగర్భ జలమట్టం మరింత పెరిగేలా గ్రామస్థాయిలో వాటర్ మేనేజ్‌మెంట్ ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం భూగర్భ, జల వనరుల శాఖ, డ్వామా, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ గ్రామాల వారీగా వాటర్ డిమాండ్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. జిల్లాలో గ్రామస్థాయిలో వాటర్ మేనేజ్‌మెంట్ ప్రణాళికల రూపకల్పనపై సమీక్షించి తగు సూచనలు చేశారు. జిల్లాలోని 799 ఇరిగేషన్ ట్యాంకులు, సంబంధిత ఫీడర్ ఛానెల్స్‌లో ఉపాధి హామీ పథకం నిధులను అనుసంధానిస్తూ పూడికతీత పనులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా నివేదిక రూపొందించాలని ఇరిగేషన్, డ్వామా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వాటర్ మేనేజ్‌మెంట్‌పై సంబంధిత శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో జల వనరుల శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలు వరలక్ష్మి, బాల శంకరరావు, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, గ్రౌండ్‌వాటర్ శాఖ డీడీ వందనం, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, ఉద్యాన శాఖాధికారి గోపీచంద్, ఏపీఎంఐపీ పీపీ శ్రీనివాసరావు, డ్వామా, వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.