
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం
● రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య
ఒంగోలు సబర్బన్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య అన్నారు. మంగళవారం ఒంగోలు వచ్చిన ఆయన కాలుష్య నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ పి.రాజాబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, ఇతర అధికారులతో వివిధ అంశాలపై కృష్ణయ్య చర్చించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగాన్ని నివారించి, మరోవైపు ఇప్పటికే ఉన్న వ్యర్థాలను రీసైకిల్, రీయూజ్ చేయటం ద్వారా సర్క్యులర్ ఎకానమీ పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదే సమయంలో కాలుష్యాన్ని కూడా తగ్గించడంపై దృష్టి సారించాల్సిన అవసరం సంబంధిత శాఖలపై ఉందన్నారు. ఇప్పటికే గ్రానైట్స్‌తో పాటు మత్స్య, వ్యవసాయ– దాని అనుబంధ రంగాలలో అవలంబిస్తున్న విధానాల ద్వారా వస్తున్న వ్యర్థాల వల్ల పర్యావరణం కాలుష్యం అవుతున్న తీరుపై ఆయన చర్చించారు. ఆయా రంగాల ద్వారా వస్తున్న వ్యర్థాలను రీయూజ్ చేయడంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే ఆరోగ్యపరమైన, పర్యావరణ సంబంధ సమస్యలపై అవగాహన కల్పించాలన్నారు. బయోడీగ్రేడబుల్ సంచులను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. పరిశ్రమలతో పాటు రైల్వేస్టేషన్లు, బస్సు స్టేషన్ల పరిసరాలు శుభ్రంగా నిర్వహించడంపై దృష్టి పెట్టాలన్నారు.
కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగ నివారణ, వివిధ రంగాల ద్వారా వచ్చే కాలుష్యాన్ని నివారించేందుకు సంబంధిత సమన్వయంతో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీపీఓ వెంకటేశ్వరరావు, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాఘవరెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్డీఓ కళావతి, జిల్లా వ్యవసాయ అధికారి రజనీకుమారి, డీఎస్‌ఓ పద్మశ్రీ, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ గోపీచంద్, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు, అన్ని మున్సిపాలిటీలు, అటవీ, రవాణాశాఖల అధికారులు పాల్గొన్నారు.