
మార్కెట్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించొద్దు
● వామపక్ష నేతలు డిమాండ్
ఒంగోలు టౌన్:
నగర నడిబొడ్డున ఉన్న కోట్లాది రూపాయల విలువైన పాత మార్కెట్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న ఆలోచన విరమించుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా నాయకులు కొత్తకోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వందల కోట్ల ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేందుకు వదిలిపెట్టడం పాలకులు ప్రజా ప్రయోజనాలకు తిలోదకాలు ఇచ్చినట్లేనని ఆరోపించారు. గత 15 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఈ స్థలాన్ని ఎలాంటి చర్చ లేకుండా కౌన్సిల్‌లో తీర్మానం చేయడం, కేవలం 5 రోజుల్లోనే టెండర్లు పిలవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీని వెనుక ఏయో శక్తులు ఉన్నాయో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన నగరపాలక సంస్థే వాటిని వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దారుణమని విమర్శించారు. నగరపాలక సంస్థ స్వయంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని , ఆ భవనాన్ని చిరువ్యాపారులకు అద్దెకిచ్చి స్థిరమైన ఆదాయం పొందవచ్చని సూచించారు. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకొని నిర్మాణాలు చేయాలే తప్ప నిధులు లేవన్న సాకుతో బాధ్యతల నుంచి తప్పుకోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమవుతుందన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు 33 సంవత్సరాల లీజుకు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండిపడుతుందని చెప్పారు. ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న పాలకులు మరోవైపు ప్రజా ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం చేయడాన్ని ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. నిరసనలో సీపీఎం నగర నాయకులు సయ్యద్ హుసేన్, టి.మహేష్, తంబి శ్రీనివాసరావు, జి.రమేష్, మారెళ్ల సుబ్బారావు, భక్త్ సింగ్ రాజు, సిపిఐ నాయకులు శ్రీరాం శ్రీనివాసరావు, కారుమూడి నాగేశ్వరరావు, నూనె మోహన్‌రావు, సిద్ధయ్య, కోనూరి వెంకటేశ్వర్లు, కల్లూరు లక్ష్మయ్య, మన్నం హనుమంతరావు, ఏవై రెడ్డి పాల్గొన్నారు.