
దళితుల భూఆక్రమణకు తెగబడిన టీడీపీ నేతలు
మార్కాపురం టౌన్: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో రోజురోజుకూ అరాచకాలు పెరిగిపోతున్నాయి. టీడీపీ నేతలు భూఆక్రమణలకు యథేచ్ఛగా తెగబడుతున్నారు. అడ్డొచ్చిన వారిపై దాడులు చేస్తున్నారు. దళితులు సాగుచేసుకుంటున్న భూమిని టీడీపీ నేత ఆక్రమించుకునేందుకు పైరును ధ్వంసం చేస్తుండగా అడ్డుకునేందుకు వెళ్లిన దళితులపై ఎదురు దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో సోమవారం రాత్రి జరిగింది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దళిత సంఘ నేత ఐజక్ రెండు ఎకరాల్లో సాగు చేసిన కంది పంటను పట్టణానికి చెందిన టీడీపీ నేత వక్కలగడ్డ మల్లికార్జున్ అనుచరులు సోమవారం రాత్రి ధ్వంసం చేసేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న ఐజక్ అతని బంధువులు పంట వద్దకు చేరుకుని వారిని అడ్డుకుంటుండగా తమపై మల్లికార్జున్ అనుచరులు దాడిచేశారని బాధితులు వాపోయారు. ఈ ఘటనపై ఎస్పీకి, స్థానిక పోలీసు అధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేసి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. మంగళవారం ఉదయం ఇరువర్గాలు పొలం వద్దకు చేరుకోవటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో మార్కాపురం సీఐ సుబ్బారావు సిబ్బందితో అక్కడికి వెళ్లి పరిస్థితి అదుపు చేశారు.
అర్ధరాత్రి పంటను ధ్వంసం చేసి, కబ్జాకు యత్నం
అడ్డుకునేందుకు వెళ్లిన దళితులపై ఎదురు దాడి