దేవునికే పాలుపోక! | - | Sakshi
Sakshi News home page

దేవునికే పాలుపోక!

Sep 27 2025 6:46 AM | Updated on Sep 27 2025 6:46 AM

దేవున

దేవునికే పాలుపోక!

దేవస్థానం భూమిలో నిర్మించిన ఒంగోలు డెయిరీ భవనం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పురాణ ప్రసిద్ధి చెందిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భూములకు రక్షణ లేకుండా పోయింది. స్వామి వారికి వేలాది ఎకరాలు ఉన్నా అవి అన్యాక్రాంతమై పరుల ఆధీనంలో ఉన్నాయి. ఆలయానికున్న ఆస్తులతో గుడికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ అవి అన్యాక్రాంతమవడంతో దాతల సహకారంపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా దేవస్థానానికి చెందిన 7.30 ఎకరాల భూమి సంతనూతలపాడు మండల పరిధిలోని పేర్నమిట్టలో 128–1 సర్వే నంబరులో ఉంది. దాని విలువ రూ.85 కోట్లు పైనే ఉంది. ఆ భూమిలో ప్రభుత్వం డెయిరీని నిర్మించింది. ఇది కాకుండా తిరుపతి జిల్లా గూడూరులో 99 ఎకరాలు, మండలంలోని కనుమళ్ల పంచాయతీలో 98 ఎకరాల భూమి ఉంది. ఇవి కూడా ఆక్రమణలో ఉన్నాయి.

రికార్డులు తారుమారు

దేవస్థానం భూమి 7.30 ఎకరాల్లో ఒంగోలు సహకార డెయిరీని నిర్మించారు. ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తులదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో 1978లో దీనిని ప్రారంభించారు. సుమారు రెండు ఎకరాల స్థలంలో భవనాలు, మిషనరీ ఏర్పాటు చేయగా మిగిలిన స్థలం ఖాళీగా ఉందని దేవదాయ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ విషయం తెలిసినా అప్పటి ఆలయాధికారులు పెద్దగా పట్టించుకోలేదు. 2013 ఇనాం అబాలిష్‌ చట్టం వచ్చిన తర్వాత అధికారులు ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు దేవస్థానం అధికారులు ప్రయత్నించినప్పటికీ ఆచరణ సాధ్యం కాలేదు. 2018 సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం అడంగల్‌, వన్‌–బీలో మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీగా పేరు మార్చేసింది. 1905 సంవత్సరం నాటి (బ్రిటీష్‌ కాలంలోని) ఆర్‌ఎస్‌ఆర్‌లో మాత్రం వరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పేరుమీద ఈ భూములు ఉన్నాయి. దీనిని ప్రభుత్వం మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీగా పేరు ఎలా మారుస్తుందని భక్తులు నిలదీస్తున్నారు.

జేసీ కోర్టులో కేసు..

దేవస్థానానికి చెందిన భూమిలో డెయిరీ నిర్మించడంపై జేసీ కోర్టులో కేసు దాఖలు చేశారు. దేవుడి భూముల హక్కును సైతం మార్చేయడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జేసీ కోర్టులో పలుసార్లు వాదనలు జరిగాయి. ఇదిలా ఉండగా ఏడు ఎకరాల భూమిలో ఎకరం భూమిపై తమకు హక్కులు ఉన్నాయంటూ కొందరు అత్యాశపరులు హైకోర్టులో కేసు నమోదు చేశారు. దీనిపై సంతనూతలపాడు మండల రెవెన్యూ అధికారులు సైతం ఆ భూములను పరిశీలించారు. దేవుని ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడతామని, ఇందు కోసం న్యాయపోరాటం చేస్తామని దేవస్థానం అధికారులు తెలియజేస్తున్నారు.

మూతపడిన డెయిరీ..

ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తులదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో డెయిరీ 1978లో ప్రారంభమైంది. రోజుకు 3.5 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యంతో పాటు, 30 మెట్రిక్‌ టన్నుల పాలపొడి తయారీ యూనిట్‌, 20 మెట్రిక్‌ టన్నుల వెన్న తయారీ, 10 మెట్రిక్‌ టన్నుల నెయ్యి తయారీ సామర్థ్యంతో ఒంగోలు డెయిరీ ఉండేది. 278 పాల సహకార సంఘాల ద్వారా 35 వేల మంది పాడి రైతులు నిత్యం పాలుపోసేవారు. ఒక వెలుగు వెలిగిన ఈ డెయిరీ కాలక్రమంలో ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని, రైతులకు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. దీనినే నమ్ముకుని పనిచేసిన రెగ్యులర్‌, తాత్కాలిక సిబ్బంది 120 మంది రోడ్డున పడ్డారు. ప్రస్తుతం డెయిరీ కూడా మూలపడడంతో రూ.కోట్లు విలువజేసే భూములను తిరిగి దక్కించుకునేందుకు అధికారులు పోరాటం చేస్తున్నారు.

ఆధారాలు ఉన్నాయి..

జిల్లా డెయిరీ వరాహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భూమిలో నిర్మించారు. ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం పూర్తి ఆధారాలు ఉన్నాయి. కానీ కొందరు రెవెన్యూ అధికారుల మాయాజాలంతో దేవునికి చెందాల్సిన భూములకు హక్కుదారుగా అడంగల్‌, వన్‌–బీ లో మిల్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీగా నమోదు చేశారు. ఈ భూములు దేవునికి దక్కేలా న్యాయపోరాటం చేస్తాం. ఇప్పటికే దీనిపై జేసీ కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నాం.

– పీ కృష్ణవేణి, ఈఓ, వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం

దేవునికే పాలుపోక!1
1/2

దేవునికే పాలుపోక!

దేవునికే పాలుపోక!2
2/2

దేవునికే పాలుపోక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement