
ప్రభుత్వ వైద్యుల పోరుబాట
పీజీ కోటా కోసం సమ్మె ప్రారంభించినట్లు ప్రకటన ఆన్‌లైన్ రిపోర్టులు పంపించడం ఆపేసిన వైద్యులు
ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రభుత్వ వైద్యులు సమ్మె బాట పట్టారు. ఇన్ సర్వీస్ పీజీ కోటాను రద్దు చేయడంతో కొన్నాళ్లుగా దాన్ని పునరుద్ధరించాలని ప్రాథమిక వైద్యశాలల్లో పనిచేస్తున్న వైద్యులు కోరుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో శుక్రవారం నుంచి సమ్మెకు దిగినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రాహుల్ తెలిపారు. రోజువారి విధుల్లో భాగంగా పంపించే ఆన్‌లైన్ రిపోర్టులను నిలిపేసినట్లు చెప్పారు. ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునురుద్ధరించాలని, టైం బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు బేసిక్ పే 30 శాతం ట్రైబల్ అలవెన్స్, నేటివిటి అండ్ అర్బన్ ఎలిజిబిలిటీ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉంచినట్లు తెలిపారు. వైద్యులకు కచ్చితమైన పనిగంటలు, వారంతపు సెలవులు, స్పష్టమైన జాబ్ కార్డ్ ఇవ్వడం, నాన్ మెడికల్ వ్యక్తులు విచ్చలవిడిగా ఇన్‌స్పెక్ట్ చేయకుండా మార్గదర్శకాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలను ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిరసన ప్రజలపై కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యంపైనే అని స్పష్టం చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకుండా ప్రజలకు వైద్య సేవలను అందించామని, ప్రభుత్వం ప్రాథమిక వైద్యుల సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.