
భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఒంగోలు టౌన్: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎలాంటి ఆపద వచ్చినా తక్షణ సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నదులు, వాగులు వంకలు, చెరువుల వద్ద పికెట్లు ఏర్పాటు చేసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని, పునరావాస కేంద్రాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సముద్ర తీరం వెంబడి నివశిస్తున్న ప్రజలు ఆయా ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు కానీ తుఫాన్ షెల్టర్లకు వెళ్లాలని సూచించారు. తీరప్రాంత ప్రజలు పోలీసు, రెవెన్యూ అధికారుల సూచనలు, సలహాలను పాటించాలన్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. గాలులకు రోడ్లపై విరిగిపడిన చెట్లను వెంటనే తొలగించాలని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మళ్లించాలని చెప్పారు. ఉధృతంగా ప్రవహించే నదీ పరీవాహక ప్రాంతాలలో గస్తీ నిర్వహించాలని, నీట మునిగిన రహదారుల వద్ద పికెట్లు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 112కు కానీ పోలీసు వాట్సప్ నంబర్ 9121102266కు సమాచారం అందజేయాలని కోరారు.
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ విద్యా మండలి అకడమిక్ క్యాలెండరు ప్రకారం జిల్లాలోని జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించాలని ఆర్‌ఐఓ కె.ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలు కానీ స్పెషల్ క్లాస్‌లు కానీ నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చీమకుర్తి: చీమకుర్తి మున్సిపాలిటీలోని వార్డుల సంఖ్య 20 నుంచి 27కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసినట్లు కమిషనర్ వై.రామకృష్ణయ్య శుక్రవారం తెలిపారు. ఇప్పటి వరకు 20 వార్డులు ఉండగా ఓటర్ల సంఖ్య పెరగటంతో అదనంగా మరో 7 వార్డులను పెంచినట్లు అయింది. మొట్టమొదట నగర పంచాయతీగా ఉన్న చీమకుర్తి రెండేళ్ల క్రితం గ్రేడ్–2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కావడం, ఓటర్ల సంఖ్య పెరగటంతో ప్రస్తుతం ఉన్న పాలకవర్గం రాష్ట్ర మున్సిపల్ కార్యాలయానికి పంపించిన ప్రతిపాదనలు ఆమోదం పొందటంతో రానున్న మున్సిపల్ ఎన్నికల నాటికి 27 వార్డుల్లో 27 మంది కౌన్సిలర్‌లను ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న వార్డుల్లో సరాసరిన ఒక్కో వార్డుకు 1000 మంది నుంచి 1150 మంది ఓటర్ల వరకు ఉండేవారు. 27 వార్డులకు పెరగటంతో వారి సంఖ్య 800 నుంచి 850 మంది ఓటర్ల మధ్య ఉండే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. ఇప్పుడున్న మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలపరిమితి వచ్చే ఏడాది మార్చినెల 17తో ముగియనుంది. దాదాపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావచ్చని స్థానిక నాయకులు అంచనా వేస్తున్నారు.