
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
పెద్దదోర్నాల: బైక్‌పై వెళ్తున్న ఓ గిరిజనుడిని అడవి పందులు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన పెద్దదోర్నాల మండలంలోని పెద్ద మంతనాల సమీపంలో బుధవారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పెద్దమంతనాలకు చెందిన కుడుముల రామన్న గత కొన్ని నెలలుగా యర్రగొండపాలెంలో నివాసం ఉంటూ బొగ్గుల బట్టీలు నిర్వహిస్తున్నాడు. బుధవారం వేకువజామున వ్యక్తిగత పనుల నిమిత్తం స్వగ్రామమైన పెద్దమంతనాల వస్తున్నాడు. గ్రామ సమీపంలో వేగంగా రోడ్డు దాటుతున్న అడవి పందులు రామన్న బైక్‌ను ఢీకొట్టడంతో ఎగిరిపడి అక్కడికక్కడే మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య తెలిపారు. మృతుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు.
శ్రీశైలం ఘాట్‌లో బైక్ అదుపు తప్పి..
బైక్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం శ్రీశైలం ఘాట్‌రోడ్ లోని బోడేనాయక్ తండా వద్ద చోటు చేసుకుంది. వివరాలు.. నంద్యాల జిల్లా నందికొట్కూర్‌కు చెందిన రాకేష్ బైక్‌పై శ్రీశైలం వెళ్తుండగా ఘాట్ రోడ్డులో అదుపు తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రాకేష్‌ను అదే మార్గంలో ప్రయాణిస్తున్న శ్రీశైలం వైఎస్సార్ సీపీ నాయకులు ఒట్టి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా బంధువు భరత్‌రెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గమనించారు. తమ కారును వెనక్కు మళ్లించి క్షతగాత్రుడి పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఓ అంబులెన్స్‌లో కర్నూలు తరలించేందుకు సహకరించి మానవత్వం చాటుకున్నారు.
తాటిచెర్ల వద్ద పాదచారుడు మృతి
కొమరోలు: నడుచుకుంటూ స్వగ్రామానికి వెళ్తున్న వ్యక్తిని వేగంగా వెళ్తున్న ట్రక్ ఢీకొనడంతో మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. తాటిచెర్ల గ్రామానికి చెందిన బొమ్మని రమణ(42) గిద్దలూరు హమాలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం కూడా గిద్దలూరులో పని ముగిశాక మోటు వరకు చేరుకున్నాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ తాటిచెర్ల వెళ్తున్న సమయంలో మినీ ట్రక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రమణను 108 వాహనంలో గిద్దలూరు వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నంద్యాల తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
కర్నూల్ ఘాట్‌లో అడవి పంది ఢీకొని ఒకరు..
కొమరోలు మండలం తాటిచెర్ల వద్ద ట్రక్ ఢీకొని మరొకరు..
శ్రీశైలం ఘాట్‌లో బైక్ అదుపు తప్పి యువకుడికి తీవ్రగాయాలు

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి