
మద్యానికి డబ్బులివ్వలేదనే చిత్రవధ
● భర్త చేతిలో హింసకు గురైన యువతి ఆవేదన
తర్లుపాడు: మద్యం తాగడానికి డబ్బులివ్వలేదనే కారణంతో భర్త బాలాజీ, అతని బంధువులు తనను అపహరించి, తీవ్రంగా హింసించి చంపేందుకు యత్నించారని తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడుకు చెందిన బాధిత మహిళ భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. తీవ్ర గాయాలతో కదలలేని స్ధితిలో ఉన్న భాగ్యలక్ష్మిని మంగళవారం రాత్రి పోలీసులు చికిత్స నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మద్యానికి బానిసైన తన భర్త అప్పులు చేయడమే కాకుండా వేరే మహిళతో కలిసి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నాడని తెలిపింది. కూలీనాలీ చేసుకుని నలుగురు పిల్లలను పోషించుకుంటున్నానని కన్నీటి పర్యంతమైంది. కాగా ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తర్లుపాడు పోలీసులు తెలిపారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
మార్కాపురం: తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామంలో భార్యను హింసించిన ఘటనలో బాలాజీతోపాటు సహకరించిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఏపీ మహిళా సంఘ ప్రధాన కార్యదర్శి కె.రమా దేవి కోరారు. బుధవారం ఆమె మార్కాపురంలోని వైద్యశాలకు వెళ్లి బాధిత మహిళను పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించకుంటే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆమె నలుగురు పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా సంఘ నాయకులు భూలక్ష్మి, శారా, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.
నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేస్తాం: సీఐ వెంకటేశ్వర్లు
పొదిలి: తర్లుపాడు మండంలోని కలుజువ్వలపాడులో భార్యను హింసించిన సంఘటనకు సంబందించి నిందితులందరినీ 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ విలేకర్లతో మాట్లాడారు. సంఘటన స్థలాన్ని పరిలించి, బాధితురాలితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నామన్నారు. భార్యను క్రూరంగా హింసించేందుకు భర్తకు సహకరించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లతో గాలిస్తున్నట్లు చెప్పారు.

నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేస్తాం

బాధిత మహిళ భాగ్యలక్ష్మి