
పైప్‌లైన్‌ను పునరుద్ధరించాలి
యర్రగొండపాలెం: పట్టణ శివారు ప్రాంతంలో తొలగించిన సాగర్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించాలని, అందుకు సహకరించిన అధికారులు, టీడీపీ నాయకులు, కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ హెచ్చరించారు. స్థానిక పార్టీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ ప్రజలకు తాగు నీటి అవసరాల కోసం ప్రత్యామ్నాయం అయిన డీఐకే 7 పైపులను తొలగిస్తున్న విషయాన్ని కలెక్టర్, మార్కాపురం సబ్ కలెక్టర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ, డీఈలతో ఫోన్‌లో మాట్లాడానని, ఆ పైప్‌లైన్ ప్రాముఖ్యతల గురించి వివరించారని, అయినా కాంట్రాక్టర్ యథేచ్ఛగా ఎత్తుకొని వెళ్తున్నాడని ఆయన ఆయన ఆరోపించారు. నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడికి కాసుల వర్షం కురిపించిన కాంట్రాక్టర్ పైపులు తరలించడమే పనిగా పెట్టుకున్నాడని, ఈ చర్య యర్రగొండపాలెం పట్టణ ప్రజలకు అన్యాయం చేయడమేనని అన్నారు. భూమిలో ఉన్న కోట్లాది రూపాయల విలువచేసే పైపులు తీసుకొని వెళ్తుంటే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఉలుకు పలుకు లేకుండా ఉండటంలో అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. తాగునీటి సమస్యలకు పరిష్కారం ఇవ్వాల్సిన ప్రభుత్వ అధికారులు ఉన్న వ్యవస్థను ధ్వంసం చేయడం, వాటిని పక్క నియోజకవర్గంలో జరుగుతున్న పనులకు వినియోగించడాన్ని చూస్తుంటే కాంట్రాక్టర్ ఎరిక్షన్‌బాబుకు పెద్ద ఎత్తున ముడుపులు అప్పచెప్పింది వాస్తవమన్న అనుమానం ప్రజల్లో బలంగా నెలకొందని అన్నారు. ఇటీవల పట్టణ ప్రజలకు 10 రోజులుగా సాగర్ నీళ్లు అందక అనేక ఇబ్బందులు పడ్డారని, అందుకు కారణం సాగర్ పైప్ లైన్ డ్యామేజి కావడమేనని ఆయన అన్నారు. ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన అధికారులు, అధికార పార్టీ నాయకుడు, కాంట్రక్టర్‌లను న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. సమావేశంలో ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, పార్టీ మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పి.రాములు నాయక్, వైస్ ఎంపీపీ మందుల ఆదిశేషు, పుల్లలచెరువు మండల పార్టీ అధ్యక్షుడు దోమకాల వెంకటేశ్వర్లు, సర్పంచ్ ఆవుల కోటిరెడ్డి, ఎస్సీ సెల్ నాయకుడు బి.బాలచెన్నయ్య పాల్గొన్నారు.
పైపులు తరలించేందుకు సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్