
కందికి ఎగనామం!
చౌక నిర్ణయం..
6,61,206
జిల్లాలో రేషన్‌కార్డులు
1,392
రేషన్ దుకాణాలు
రేషన్ కార్డుదారులకు కందిపప్పు
దూరమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరకొరగా ఇస్తూ వచ్చింది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి రేషన్ షాపులకు పంపిణీని నిలిపేసింది. బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయలేక సామాన్య, మధ్య తరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా
లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు
655 టన్నులు అవసరమవుతుంది.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కందిపప్పు ధరలు భారీగా
పెరిగినప్పుడు కార్డుదారులకు చౌకధరల దుకాణంలో తక్కువ ధరకే
అందిస్తూ అండగా నిలిచింది. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.
● రేషన్ దుకాణాల్లో కందిపప్పునకు మంగళం పాడేసిన కూటమి సర్కార్
● ఏడు నెలలుగా పంపిణీ నిలిపివేత
● బియ్యం, పంచదారకే పరిమితం
● డీలర్లకు డీడీలు తీయొద్దంటూ అధికారుల సూచన
● జిల్లా వ్యాప్తంగా 655 టన్నుల పప్పు అవసరం
● బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనలేక ఇబ్బందులు
బేస్తవారిపేట: కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం నిత్యావసర వస్తువుల పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. అధికారంలోకి వచ్చీ రాగానే అధికార టీడీపీ నేతలు రేషన్ దుకాణాలపై కన్నేశారు. దశాబ్దాలుగా రేషన్ దుకాణాలనే నమ్ముకుని ఉన్నవారిని తొలగించేందుకు కుట్రలకు తెరతీశారు. చాలా మందిపై బెదిరింపులకు దిగారు. అధికారులతో దాడులు చేయించారు. జిల్లాలో తమ మాట వినని దుకాణాలపై పదుల సార్లు అధికారులతో దాడులు చేయించారంటే ఎంతకు తెగించారో అన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్య్ప్తాంగా 1392 రేషన్ దుకాణాలు ఉండగా అందులో 1000 మందికి పైగా డీలర్లను తమకు అనుకూలమైన వారిని పెట్టుకుని బియ్యం దందాకు తెరతీశారు. ఇక కూటమి ప్రభుత్వం గత వైఎస్సార్ సీపీ ఇంటి ముంగిటకే ప్రజా పంపిణీ వ్యవస్థను తీసుకొచ్చింది. ఎండీయూ వాహనాలతో నాలుగేళ్లుగా రేషన్ పంపిణీ చేస్తూ లబ్ధిదారులకు అండగా నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీల నేతలు రేషన్ పంపిణీ వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకుని బియ్యం దందాకు తెరతీశారు. ప్రభుత్వం ఎండీయూ వాహనాలను రద్దు చేసి రేషన్ దుకాణాలకు వెళ్లి అవస్థలు పడుతూ నిత్యావసరాలు తీసుకునే దుస్థితి కల్పించింది. ఇదిలా ఉంటే ప్రజలకు అత్యవసరమైన కందిపప్పు సరఫరాకు మంగళం పాడేసింది. జిల్లాలో మొత్తం ప్రభుత్వ రేషన్ దుకాణాలు 1,392, రేషన్‌కార్డులు 6,61,206 ఉన్నాయి. నెలనెలా కందిపప్పు లబ్ధిదారులకు సరఫరా చేయాలంటే సుమారు 655 టన్నులు అవసరమవుతుంది. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి మూడు నెలలు అరకొరగా కందిపప్పు సరఫరా చేస్తూ వచ్చింది. లబ్ధిదారుల్లో సగం మందికి అందేది కాదు. ఇక రాను రాను పంపిణీని నిలిపేసింది. వచ్చే నెలలో పంపిణీ చేస్తామంటూ పౌరసరఫరాల శాఖ అధికారులు ఏ నెలకానెల చెబుతూ వస్తున్నారు. ప్రతి నెలా కార్డుదారులకు నిరాశ తప్పడంలేదు. ఈనెల కూడా కందిపప్పు రాలేదని డీలర్లు చెబుతుండటంతో చేసేది లేక ఇచ్చిన బియ్యం తీసుకుని వారు వెనుతిరుగుతున్నారు. కొన్ని నెలల క్రితం బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.180 వరకూ పలికింది. ఈ ధర కొన్ని నెలలపాటు కొనసాగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో సబ్సిడీ ధరకు కందిపప్పు సరఫరా చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చెతులెత్తేసింది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు కిలో రూ.130 ఉంది. రేటు ఎక్కువగా ఉన్నప్పుడు సబ్సిడీపై ఇవ్వలేని ప్రభుత్వం, కనీసం ధర తక్కువగా ఉన్నప్పుడైనా ప్రజలకు అందించేందుకు ముందుకు రావడంలేదు. కూటమి ప్రభుత్వం వస్తుంది మీ కష్టాలు తీరుస్తుంది అని ఊదరగొట్టిన పాలకులు పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకపోగా, చివరికి కందిపప్పు కూడా కార్డుదారులకు పంపిణీ చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డీడీలు తీయని డీలర్లు...
రేషన్ డీలర్లు ప్రతి నెలా 20వ తేదీ లోపు డీడీలు తీసి, తమ పరిధిలోని కార్డుదారులకు అవసరమైన బియ్యం, కందిపప్పు, పంచదార వంటి సరుకులు దిగుమతి చేసుకుంటారు. కొన్ని నెలలుగా డీలర్లు డీడీలు తీస్తున్నా పౌర సరఫరాల శాఖ మాత్రం అవసరమైన మేరకు కందిపప్పు సరఫరా చేయడం లేదు. ప్రస్తుతం కందిపప్పు కోసం డీడీలు తీయవద్దని డీలర్లకు ముందుగానే అధికారులు సమాచారం ఇస్తున్నారు. దీంతో వారు డీడీలు కట్టడం మానేశారు. బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు కావాలని కార్డుదారులు అడుగుతుంటే తమకే రాలేదని డీలర్లు బదులిస్తున్నారు.
పెరిగిన ధరలతో అవస్థలు..
నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు జీవనానికి ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఆయిల్, కందిపప్పు ధరలు ఆకాశాన్నంటడంతో కొనుగోలు చేయడం తలకు మించిన భారంగా మారింది. ప్రభుత్వం రాయితీపై రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరా చేయాలని కార్డుదారులు కోరుతున్నారు.
19,37,977
కార్డుల్లోని సభ్యులు