
మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం
గిరిజన ప్రాంతాల్లో
● అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: గిరిజన ఆవాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు త్వరగా కల్పించడంపై మరింత దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. పీ.ఎం–జన్‌మన్, డీ.ఏ– జె.జి.యు.ఏ. పథకాల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాల్లో పురోగతిపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజన ఆవాసాల్లో, ప్రత్యేకించి ఐటీడీఏ పరిధిలో ఉన్న పశ్చిమ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచాల్సి ఉందన్నారు. గృహ నిర్మాణాల్లో ప్రతివారం స్పష్టమైన పురోగతి ఉండాలన్నారు. గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంతోపాటు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. బిల్లులను ప్రభుత్వం త్వరగా చెల్లిస్తున్నందున లబ్ధిదారులందరూ వెంటనే ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ఆవాస గ్రామాలకు రోడ్లు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు, వంట గ్యాస్ కనెక్షన్లు, టెలిఫోన్ టవర్ల నిర్మాణం, మొబైల్ మెడికల్ యూనిట్ల సేవలు అందేలా శాఖల వారీగా, సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. సాంకేతిక సమస్యలు ఏమైనా తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాల శంకర్రావు, డిప్యూటీ డీఈవో చంద్రమౌళీశ్వరరావు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రవితేజ, డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ పద్మశ్రీ, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, మత్స్యశాఖ జే.డీ.శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ జేడీ రవికుమార్, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, ఏపీ సీపీడీసీఎల్ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు, రోడ్లు భవనాలు, టెలికాం శాఖ అధికారులు పాల్గొన్నారు.