
కూటమి పార్టీల్లో ఆధిపత్య పోరు.!
సాక్షి ప్రతినిధి ఒంగోలు: దర్శి కేంద్రంగా కూటమి పార్టీల్లో ఆధిపత్య పోరు ఊపందుకుంది. దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పదవి విషయంలో కూటమి పార్టీలైన టీడీపీ–బీజేపీ మధ్య అగ్గి రాజుకుంది. ఈ పదవిని టీడీపీకి చెందిన ఓసీ మహిళకు కేటాయించేందుకు ఎస్సీ రిజర్వేషన్‌ను సైతం టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి మార్పించారు. టీడీపీకి చెందిన దారం సుబ్బారావు సతీమణి, దర్శి 19వ వార్డు కౌన్సిలర్ దారం నాగవేణి పేరును ప్రకటించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాగవేణి కోసం ఎస్సీలకు కేటాయించిన సీటును మార్పించి ఎస్సీలకు అన్యాయం చేశారు. కానీ, బీజేపీ నేతలు పావులు కదిపి ఆ పార్టీ నాయకుడు మాడపాకుల శ్రీనివాసులు భార్య నారాయణమ్మకు దర్శి ఏఎంసీ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. ఆ మేరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే, తాజాగా బీజేపీకి కేటాయించిన దర్శి ఏఎంసీ చైర్మన్ పదవిని మళ్లీ టీడీపీకే కట్టబెట్టారు. జీవో సవరణ పేరుతో గతంలో ప్రకటించిన మాడపాకుల నారాయణమ్మ పేరు మార్చి దారం నాగవేణికి చైర్మన్ పదవిస్తూ జీవో సవరణ చేశారు. దీంతో బీజేపీ నేతలకు టీడీపీ నేతలు షాక్ ఇచ్చినట్లయింది.
మంత్రుల ద్వారా పావులు కదిపిన గొట్టిపాటి లక్ష్మి...
బీజేపీ నాయకులు అనూహ్యంగా ఏఎంసీ చైర్మన్ పదవి దక్కించుకోగా, ఆ ఉత్తర్వులు మార్పించేందుకు మంత్రుల ద్వారా పావులు కదిపి గొట్టిపాటి లక్ష్మి సక్సెస్ అయ్యారు. బీసీ కులానికి చెందిన బీజేపీ నాయకుని భార్య మాలపాకుల నారాయణమ్మ పేరును చైర్మన్ పదవికి ఖరారు చేస్తూ జీవో విడుదలైంది. దీంతో తమకు మాట ఇచ్చి వేరొకరికి పదవి కట్టబెట్టడంపై గొట్టిపాటి లక్ష్మిని నాగవేణి వర్గీయులు, టీడీపీ నేతలు గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా గొట్టిపాటి లక్ష్మి పేరు మార్పు చేయించినట్లు సమాచారం. సోమవారం గుంటూరు మార్కెట్ యార్డ్‌లోనే ఈ మార్పు చేయించి సంబంధిత ఉత్తర్వుల కాపీ తీసుకున్న తర్వాతే గొట్టిపాటి లక్ష్మి దర్శి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మండిపడుతున్న ఎస్సీ, బీసీలు...
సోమవారం కురిచేడు మండలం కల్లూరు వద్ద విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభానికి గొట్టిపాటి లక్ష్మి రావాల్సి ఉండగా, పేరు మార్చిన జీవో కాపీ చేతికి వచ్చిన తర్వాతే దర్శి వస్తానని పట్టుబట్టింది. ఆ జీవో తీసుకున్న తర్వాతే గొట్టిపాటి లక్ష్మి దర్శి వచ్చారని దర్శి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, నియోజకవర్గంలో ఎస్సీలకు కేటాయించిన సీటును కాదని ఓసీలకు మార్చారని, ఆ తర్వాత అధిష్టానం బీసీలకు కేటాయిస్తే వారికి కూడా దక్కనీయకుండా ఓసీలకు కట్టబెట్టడంపై ఎస్సీలు, బీసీలు మండిపడుతున్నారు. తమది బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ.. ఇప్పుడు బీసీలకు తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి బీజేపీ నేతలు...
ఏఎంసీ చైర్మన్ పదవికి పేరు మార్చడంపై దర్శి బీజేపీ నేతలు వెంటనే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ని కలిసినట్లు తెలిసింది. తమకు జరిగిన అన్యాయాన్ని వారు వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు రాష్ట్ర అధ్యక్షుడు స్పందిస్తూ మరో పదవి ఇప్పించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా.. వచ్చేసారైనా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తమకు లభించేలా చేయాలని కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీకి ఇచ్చిన ఒక్క పదవి కూడా వారికి దక్కకుండా టీడీపీ నేతలు పేరు మార్చడంతో తామంతా పార్టీకి కష్టపడి పనిచేయడం ఎందుకని బీజేపీ నేతలు ఆవేదన వెల్లగక్కుతున్నారు. ఈ విషయంపై బీజేపీ నాయకుడు, మాడపాకుల నారాయణమ్మ భర్త శ్రీనివాసులను సాక్షి ప్రతినిధి సంప్రదించగా, తామంతా కూటమిలో భాగస్తులమని, గత ఎన్నికల్లో కూటమికి కష్టపడి పనిచేశామని చెప్పారు. తమకు వచ్చిన అవకాశాన్ని దక్కకుండా మార్పు చేయడం తమను ఎంతో బాధిస్తోంన్నారు. అధికారికంగా ఇచ్చిన జీవోలో సునాయాసంగా పేర్లు మార్పు చేయించడంపై అసహనం వ్యక్తం చేశారు.
దర్శి ఏఎంసీ చైర్మన్ పదవి సాక్షిగా బహిర్గతం బీజేపీపై నెగ్గిన టీడీపీ పంతం టీడీపీకి చెందిన నాగవేణికే ఏఎంసీ చైర్మన్ పదవి తొలుత బీజేపీకి చెందిన నారాయణమ్మకు కేటాయిస్తూ ఉత్తర్వులు పంతానికి పోయి ఉత్తర్వులు మార్పించిన టీడీపీ దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి భగ్గుమంటున్న బీజేపీ నేతలు