
బరితెగించిన గ్రావెల్ మాఫియా
బేస్తవారిపేట: అధికార పార్టీ నేతల అండతో గిద్దలూరు నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమార్కులు చెలరేగుతున్నారు. ఇప్పటికే పెంచికలపాడు సమీపంలోని చెరువు మట్టిని బేస్తవారిపేట, కొమరోలు, గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో ఇటుకల బట్టీలకు నిరంతరం తరలిస్తున్నారు. తాజాగా జగనన్న కాలనీ వద్ద ఉన్న కొండపై అక్రమార్కుల కన్ను పడింది. అనుమతి తీసుకోకుండా యథేచ్ఛగా గ్రావెల్ తవ్వి తరలిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మండల స్థాయి అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి గ్రావెల్ దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం సమీపంలో ఉన్న జగనన్న కాలనీ పైఎత్తున ఉన్న కొండపై అక్రమార్కులు కన్నేశారు. గత మూడు రోజులుగా ప్రభుత్వ భూముల్లో రెండు జేసీబీలతో గ్రావెల్ తవ్వి, 20 ట్రాక్టర్లతో దర్జాగా తరలిస్తున్నారు. రెండో శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో అక్రమార్కులకు అడ్డులేకుండాపోయింది. సోమవారం అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. అక్రమంగా మట్టి తరలిస్తున్నారని మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే శ్రీమా వద్ద స్టాఫ్ ఇద్దరే ఉన్నారు.. మేము ఎక్కడికని రావాలి.. స్థానికంగానే అడ్డుకోండిశ్రీ అని సెలవిచ్చారని మోక్షగుండం గ్రామస్తులు తెలిపారు. వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికై న రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుని మట్టి అక్రమ రవాణాను అడ్డుకుని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని మోక్షగుండం, పందిళ్లపల్లె గ్రామస్తులు కోరుతున్నారు.
బేస్తవారిపేట మండలం మోక్షగుండం సమీపంలో కరిగిపోతున్న కొండ 2 జేసీబీలు, 20 ట్రాక్టర్లతో గ్రావెల్ అక్రమ రవాణా 3 రోజులుగా దోచేస్తున్నా చోద్యం చూస్తున్న అధికారులు

బరితెగించిన గ్రావెల్ మాఫియా