
నాయకత్వంపై హెచ్‌ఎంలకు శిక్షణ
పొదిలి: జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. పొదిలిలోని జోసఫ్ శ్రీహర్ష అండ్ ఇంద్రజ మేరీ ఎడ్యుకేషనల్ సొసైటీ కళాశాలలో నాలుగు రోజుల శిక్షణను మార్కాపురం డీవైఈఓ మామిళ్లపల్లి శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను పాఠశాలల్లో అమలు చేయాలని కోరారు. కోర్సు డైరెక్టర్‌గా మర్రిపూడి ఎంఈఓ రంగయ్య వ్యవహరించారు. శిక్షణ ఉద్దేశాలను వివరించారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి డి.నాగరాజు, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎం.జాలరత్నం, ఎంఈఓ యు.శ్రీనివాసులు, 289 పాఠశాలల హెచ్‌ఎంలు, 9 మంది మాస్టర్ ఫెసిలిటేటర్స్ పాల్గొన్నారు.
పోలీసు గ్రీవెన్స్‌కు 94 ఫిర్యాదులు
ఒంగోలు టౌన్: ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 94 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు పోలీసు అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. ఫిర్యాదులను స్వీకరించిన ఉన్నతాధికారులు ఆయా స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.నాగేశ్వరరావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, ఎస్సీఎస్టీ సెల్ సీఐ దుర్గాప్రసాద్, డీటీసీ సీఐ షమీముల్లా, పీజీఆర్‌ఎస్ ఎస్సై జనార్దనరావు పాల్గొన్నారు.
గ్రానైట్ గనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి
చీమకుర్తి రూరల్: గ్రానైట్ గనుల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సూచించారు. సోమవారం చీమకుర్తి మండలంలోని పలు గ్రానైట్ గనులు, పరిశ్రమలను ఎస్పీ దామోదర్‌తో కలిసి ఐజీ సందర్శించారు. భద్రతా ప్రమాణాలపై పలు సలహాలు, సూచనలు చేశారు. ముందుగా చీమకుర్తి పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్ గనులు, పరిశ్రమలలో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు అధిక సంఖ్యలో ఉండటంతో ఎక్కువ నేరాలు జరిగే అవకాశం ఉందన్నారు. ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. చీమకుర్తి సీఐ సుబ్బారావు, ఎసైలు కృష్ణయ్య, హరిబాబు, శివరామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.