
దళితులకు రక్షణ కరువు
ఒంగోలు టౌన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది పాలనలో దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని, దళితులకు రక్షణ లేకుండా పోయిందని కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి ఆరోపించారు. స్థానిక ఎల్బీజీ భవనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై దాడులు జరుగుతున్నా తగిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. నేరస్తులకే అండగా నిలుస్తోందని విమర్శించారు. దళితులపై జరుగుతున్న అమానవీయ దాడులపై నిర్వహించాల్సిన మానిటరింగ్ కమిటీ సమావేశాలను సక్రమంగా జరపకపోవడం విచారకరమన్నారు. అసలు మానిటరింగ్ కమిటీనే ఏర్పాటు చేయకపోవడం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఎస్సీ చైర్మన్‌గా మూడు నెలల క్రితం నియమితులైన జవహర్ చైర్మన్ హోదాలో ఇప్పటి వరకు దళితులపై దాడులు జరిగిన ప్రాంతాలను సందర్శించకపోవడం దారుణమన్నారు. ఏడాది కాలంగా దళితులపై జరిగిన దాడులపై విచారణ చేపట్టాలని మాల్యాద్రి డిమాండ్ చేశారు.
ఎస్సీలకు ఉచిత విద్యుత్‌ను నీరుగారుస్తున్న కూటమి...
కూటమి అధికారంలోకి వచ్చాక దళితులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని మాల్యాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా ఎస్సీలకు అమలవుతున్న ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు. బాబూ జగ్జీవన్‌రామ్ పేరు మీద ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, దాన్ని నగరంలో అమలు చేయడం లేదని తెలిపారు. తమ బృందం జరిపిన పర్యటనలో ఒంగోలు నగరంలోని మామిడిపాలెం, గద్దలగుంటలో వినియోగదారుల నుంచి విద్యుత్ ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఎస్సీలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. పెంచిన ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంలో ఎస్సీలకు ఎలాంటి షరతులు లేకుండా సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని అమలు చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్‌మీటర్లను పగులగొట్టమంటూ పిలుపునిచ్చిన లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చి స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతాంగానికి వాడే మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద గ్రౌండ్ చేసిన 7 లక్షల మంది లబ్ధిదారులకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని, 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వృద్ధాప్య పింఛన్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని మాల్యాద్రి హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రఘురాం, జిల్లా నాయకులు అట్లూరి రాఘవులు, వి.మోజెస్ పాల్గొన్నారు.
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి విమర్శ