
నేడు ఆక్రమించుకుని..!
నాడు పట్టాల పంపిణీ..
పీసీ పల్లి: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు పంపిణీ చేయగా, నేడు కూటమి ప్రభుత్వంలో అధికార టీడీపీ నాయకులు దౌర్జన్యంగా ఆయా భూములను ఆక్రమించుకుని ఏకంగా దున్నేస్తున్నారు. పీసీ పల్లి మండల పరిధిలోని మురుగమ్మి గ్రామ పంచాయతీలో శనివారం చోటుచేసుకున్న ఈ సంఘటన అధికార పార్టీ నేతల అరాచకాలకు అద్దం పడుతోంది. గ్రామ పంచాయతీలోని సర్వే నంబర్ 333/6లో మొత్తం రెండెకరాలు ప్రభుత్వ భూమి ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆ భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. సుమారు 46 మంది పేదలకు పట్టాలు అందజేశారు. అయితే, ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడుతూ పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలను కూడా వదలకుండా కాజేస్తున్నారు. అందులో భాగంగానే శని, ఆదివారాలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు చూసుకుని ఓ టీడీపీ నాయకుడు మురుగమ్మి గ్రామంలో పేదలకు ఇళ్లస్థలాలుగా ఇచ్చిన భూమిని దర్జాగా కబ్జా చేశాడు. శనివారం సంబంధిత భూమిని ఏకంగా దున్నేశాడు. పంటలు సాగుచేసేందుకు సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మురుగమ్మి గ్రామంలోని ఓ టీడీపీ నాయకుడు సచివాలయ శిలాఫలకాన్ని పగలగొట్టాడు. మరికొంత మంది నాయకులు అందినకాడికి దోచుకుందామంటూ అటవీ, పోరంబోకు, రెవెన్యూ భూములపై పడి రాత్రికిరాత్రి లారీలకు లారీల తెల్లరాయిని తరలిస్తున్నారు. వీటన్నింటినీ మరవకముందే తాజాగా పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసిన భూములను ఆక్రమించుకోవడంతో టీడీపీ నేతల దౌర్జన్యాలపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.