
పేద కుటుంబాన్ని దత్తత తీసుకున్న ఇన్‌చార్జి కలెక్టర్
మద్దిపాడు: మండలంలోని మల్లవరం గ్రామంలో నివాసం ఉంటున్న శింగమనేని మరియమ్మ కుటుంబాన్ని ఇన్‌చార్జి కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ శుక్రవారం దత్తత తీసుకున్నారు. మరియమ్మ భర్త చనిపోగా ఆమె తన కుమార్తె, కుమారునితో కలిసి తల్లి వద్దనే ఉంటూ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమె కుటుంబాన్ని దత్తత తీసుకోవడానికి ఇన్‌చార్జి కలెక్టర్ ముందుకు వచ్చారు. మరియమ్మ కుమార్తె ఇంటర్ చదువుతుండగా, అబ్బాయి 9వ తరగతి హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు. కుమార్తెను ఏదైనా ఒకేషనల్ కోర్సులో చేర్పించి ఉద్యోగం వచ్చేలా తాను చూసుకుంటానని గోపాలకృష్ణ హామీ ఇచ్చారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇప్పిస్తానని, దానికి అదనంగా అవసరమైతే తాను డబ్బుఖర్చు చేస్తానని తెలిపారు. ఇన్‌చార్జి కలెక్టర్ మరియమ్మ ఇంటికి వెళ్లే క్రమంలో ఆ కుటుంబానికి కావలసిన రేషన్, కూరగాయలు, ఇతర వస్తువులు తాను స్వయంగా కొనుగోలు చేసి అందించారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, గ్రామ సర్పంచ్ నారా సుబ్బారెడ్డి, ఎంపీడీఓ వి జ్యోతి సచివాలయ సిబ్బంది పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
నగరంలో మెడికల్ షాపుల తనిఖీలు
ఒంగోలు టౌన్: ఔషధ నియంత్రణ అధికారులు నగరంలో శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు, బాపట్ల, మార్కాపురం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల బృందం జీజీహెచ్, సుందరయ్య భవన్ రోడ్డు, కొత్తపట్నం సెంటర్, 60 అడుగుల రోడ్డు పరిసరాల్లోని 9 మెడికల్ షాపులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కొన్ని నిబంధనల ప్రకారం ఫార్మాసిస్ట్ లేకుండానే మెడికల్ షాపులను నిర్వహించడం, బిల్లులను ఇవ్వకుండానే ఔషధాలను విక్రయించడం వంటివి గుర్తించినట్లు అసిస్టెంట్ డైరక్టర్ జ్యోతి తెలిపారు. కొన్ని మెడికల్ షాపుల నుంచి జనరల్, జనరిక్ ఔషధాలకు సంబంధించిన శాంపిల్స్‌ను సేకరించినట్లు చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన షాపులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడు మృతి
సీఎస్‌పురం(పామూరు): రోడ్డు ప్రమాదంతో గాయపడిన యువకుడు తిరుపతి వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై ఎం.వెంకటేశ్వరనాయక్ కథనం మేరకు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురానికి చెందిన సురేష్(32), వినోద్ గురువారం పామూరులోని బంధువుల ఇంటికి వచ్చి, రాత్రి వేళ బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు. అయ్యలూరివారిపల్లె సమీపంలో జాతీయ హైవేపై గేదెలు అడ్డురాగా బైక్ అదుపుతప్పి పడిపోవడంతో సురేష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఉదయగిరి వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో యువకుడు వినోద్‌కు స్వల్పగాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.