● మిర్చి గ్రేడింగ్ పనుల్లో మహిళలు
పెద్దారవీడు: మిర్చి కోతలు, కల్లాల్లో మిర్చి గ్రేడింగ్ చేయాలంటే కూలీలు చాలా అవసరం. మండలంలో ఓ వైపు భగభగమంటున్న భానుడు, మరో వైపు మిర్చి ఘాటులను పట్టించుకోకుండా మహిళలు తలకు గుడ్డ చుట్టుకుని మండు టెండలను అధిగమిస్తూ, ఘాటును భరిస్తూ కోతలు, గ్రేడింగ్ పనులు చేస్తున్నారు. చూసేవారంతా ఎండను తట్టుకొని ఎలా పనులు చేస్తున్నారు తల్లీ అంటున్నారు. మండలం పరిధిలో పెద్దారవీడు, గొబ్బూరు, ఓబులక్కపల్లి గ్రామాల్లో ఒక వైపు మిర్చి కోతలు, మరో వైపు కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి గ్రేడింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కూలీలకు మంచి నీటి సౌకర్యం రైతులు అందుబాటులో ఉంచుతున్నారు. ఎండలకు ఎంత నీరు తాగినా చాలటం లేదంటున్నారు మహిళలు. ప్రస్తుతం 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతను భరిస్తూ మహిళలు కూలి పనులు చేస్తున్నారు.