మృత్యుఘోష | - | Sakshi
Sakshi News home page

మృత్యుఘోష

May 5 2025 8:14 AM | Updated on May 5 2025 8:14 AM

మృత్య

మృత్యుఘోష

వేకువన
● జాతీయ రహదారిపై నిమిషాల వ్యవధిలో మూడు ప్రమాదాలు ● ఐదుగురి దుర్మరణం, నలుగురికి గాయాలు ● వారిలో ఒకరి పరిస్థితి విషమం ● మృతులు నెల్లూరు, గుంటూరు జిల్లావాసులు ● నుజ్జునుజ్జయిన లారీ, కారు ● మొక్కు తీర్చుకునేందుకు తిరుపతికి వెళుతూ మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలిన తల్లీ కొడుకు ● గమ్యస్థానం చేరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిన బాబాయ్‌, అబ్బాయ్‌ ● సురక్షితంగా బయటపడిన రెండేళ్ల చిన్నారి
వేకువజామున గం.4.50 సమయం.. ఒంగోలులో నిమిషాల వ్యవధిలో జరిగిన మూడు ప్రమాదాలతో జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఈ దారుణ ఘటనల్లో ఐదుగురు విగతజీవులు కాగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలం చూపరులకు ఒళ్లుగగుర్పాటు కలిగించేలా ఉంది. చెల్లా చెదురైన లారీ, నుజ్జు నుజ్జయిన కారులో ఇరుక్కొని పోయిన మృతదేహాలతో భయకంపితంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డు మీద వందలాది వాహనాలు నిలిచిపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదంలో తల్లీ కొడుకు, బాబాయ్‌, అబ్బాయ్‌ విగతజీవులయ్యారు.

ఒంగోలు టౌన్‌: జాతీయ రహదారిపై ఒంగోలు సమీపంలోని కొప్పోలు ఫ్లై ఓవర్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాలతో నగరం ఉలిక్కిపడింది. వెంట వెంటనే మూడు రోడ్డు ప్రమాదాలు సంభవించడం... ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం నిముషాల వ్యవధిలోనే జరిగిపోయింది. నలుగురికి గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఒకరిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొప్పోలు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి దాటిన తరువాత కొద్ది దూరంలో టైరు పంక్చర్‌ కావడంతో ఒక లారీ ఆగి ఉంది. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ నుంచి నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడు గ్రామానికి కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. అదే సమయంలో ప్రమాద స్థలానికి కొద్ది దూరంలో ఇటుక లోడుతో వస్తున్న ట్రాక్టర్‌, కారు, ఒక మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. దానికి 500 మీటర్ల దూరంలో మరో ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి తిరుపతి వెళుతున్న కారును వెనక నుంచి వచ్చిన భారీ కంటైనర్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు.

భర్త ఒంగోలులో...భార్య గుంటూరులో..

ఈ ప్రమాదంలో బూసి వినయ్‌ కుటుంబం పరిస్థితి దయనీయంగా ఉంది. తలకు తీవ్రంగా గాయాలైన వినయ్‌ కోమాలోకి వెళ్లి పోయారు. ఒంగోలులోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో అత్యవసరంగా ఆపరేషన్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వినయ్‌ భార్య బూసి లావణ్యకు వెన్నెముకకు గాయం కావడంతో పాటుగా కాలు విరిగింది. దీంతో ఆమెకు మెరుగైన వైద్య చికిత్స కోసం గుంటూరు తరలించారు. ఈ దంపతుల రెండేళ్ల కుమారుడు లోక్షిత్‌ సురక్షితంగా బయటపడ్డాడు. అమ్మా నాన్నలు కనిపించకపోవడంతో ఆ చిన్నారి రోదిస్తుండడం స్థానికులను కలిచివేసింది.

బాబాయ్‌..అబ్బాయ్‌ దుర్మరణం:

నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడు గ్రామానికి చెందిన రావినూతల బాబు (42), రావినూతల నాగేంద్ర (20) వరసకు బాబాయ్‌, అబ్బాయ్‌ అవుతారు. కోడిగుడ్లు తీసుకొని తెలంగాణలోని భువనగిరి నుంచి శనివారం రాత్రి బయలుదేరారు. మరో రెండు గంటలు గడిస్తే గమ్యం చేరుకుంటారనగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలిగొంది. ఒంగోలు–నెల్లూరు జాతీయ రహదారి మీద కొప్పోలు ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి దాటగానే కొద్ది దూరం ప్రయాణించారో లేదో ఎదురుగా ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. కళ్లు తెరచి చూసే లోపలే పెద్ద శబ్దం వచ్చింది. కోడిగుడ్లన్నీ ఎగిరి రోడ్డు మీద పడ్డాయి. లారీ ముందు భాగం మొత్తం తుక్కుతుక్కయిపోయింది. లారీ డ్రైవర్‌ రవణయ్య అలియాస్‌ షేక్‌ రహీం (60)తో సహా బాబాయ్‌, అబ్బాయ్‌ ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకరి తల పగిలిపోయి ఛిద్రమైంది. నాగేంద్రకు వచ్చే నెలలో వివాహం జరగనున్నట్లు సమాచారం.

ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో రోడ్డుపై

బోల్తాపడిన కోడిగుడ్ల లారీ

తల్లీ, కుమారుడు మృతి...

పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ తిరుమలశెట్టి కృష్ణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లావణ్యను అమరావతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బూసి వినయ్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారి రెండేళ్ల బాబు లోక్షిత్‌కు పుట్టు వెంట్రుకలు సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు గుంటూరు నుంచి తిరుపతికి కారులో బయలు దేరారు. వినయ్‌ కారులో వారికి సైతం మొక్కు ఉండడంతో గుంటూరులో ఉంటున్న ఆర్‌ఎంపీ కృష్ణ పెద్ద అన్నయ్య కుమారుడు, ఒక ప్రైవేటు కాలేజీలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన భార్య పావని(40), వారి చిన్నకుమారుడు చంద్రకౌశిక్‌ (15)లు సైతం ఎక్కారు. సరిగ్గా తెల్లవారుజామున గం.4.50 కు జాతీయ రహదారిపై ఒంగోలు చేరుకున్నారు. బైపాస్‌ నుంచి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి దిగిన తరువాత కొద్ది దూరంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఉండడంతో కారు ఆపారు. అంతలోనే వేగంగా వచ్చిన ఒక భారీ కంటైనర్‌ ఢీ కొట్టింది. ముందున్న లారీ, వెనక ఉన్న కంటైనర్ల మధ్య చిక్కుకున్న కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తల్లీ కొడుకులు తిరుమలశెట్టి పావని, చంద్ర కౌశిక్‌ అక్కడికక్కడే మృతి చెందారు. భర్త వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం షాక్‌లో ఉన్న ఆయనకు నగరంలోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. చంద్రకౌశిక్‌ గత నెలలో విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 576 మార్కులు సాధించాడు. దీంతో తల నీలాలు సమర్పించేందుకు తిరుమల బయలుదేరగా మృత్యువు కబళించింది. తల్లీకుమారులు మృత్యువాత పడడంతో కొప్పురావూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆర్‌ఎంపీ కృష్ణ చిన్న కుమార్తెకు మూడు నెలల క్రితమే వివాహం జరిగి ఇంటి ముందు వేసిన పందిరి కూడా తీయలేదు. ఇంతలోనే ఊహించని విషాదంతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

మృత్యుఘోష 1
1/6

మృత్యుఘోష

మృత్యుఘోష 2
2/6

మృత్యుఘోష

మృత్యుఘోష 3
3/6

మృత్యుఘోష

మృత్యుఘోష 4
4/6

మృత్యుఘోష

మృత్యుఘోష 5
5/6

మృత్యుఘోష

మృత్యుఘోష 6
6/6

మృత్యుఘోష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement