కూటమి ప్రభుత్వానివి ప్రజా వ్యతిరేక విధానాలు | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వానివి ప్రజా వ్యతిరేక విధానాలు

Apr 20 2025 12:42 AM | Updated on Apr 20 2025 12:42 AM

కూటమి ప్రభుత్వానివి ప్రజా వ్యతిరేక విధానాలు

కూటమి ప్రభుత్వానివి ప్రజా వ్యతిరేక విధానాలు

యర్రగొండపాలెం: ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పతోందని, అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ప్రజలతో చీదరింపులకు గురవుతోందని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో త్రిపురాంతకం మండలానికి చెందిన ఐటీ విభాగం ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు అలివికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో లిక్కర్‌, ఇసుక, రేషన్‌ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయని, కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసుకుంటున్నారని, ఇదేమిటని అడిగిన వారిని పోలీసులతో తప్పుడు కేసులు బనాయింపచేసి అరెస్ట్‌లు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. తండ్రి సీఎంగా, తనయుడు రాష్ట్ర మంత్రిగా, దత్తపుత్రుడు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అబాసుపాలు చేస్తున్నారని, వీరి ఆధ్వర్యంలో రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యం ఏలుతోందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ప్రియులకు నాణ్యమైన, సరసమైన ధరలకు మద్యం అందిస్తామని చెప్పి వారి ఓట్లు దండుకున్న కూటమి నాయకులు పేదోళ్లు సేవించే చీప్‌ లిక్కర్‌ రూ.99లకు అమ్మకాలకు పెట్టారని, పెత్తందారులకు మాత్రం రూ.కోట్లాది విలువ చేసే భూములు 99 పైసలకే అప్పగించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోనే వెనక బడిన ప్రాంతమైన యర్రగొండపాలెం నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించక పోవడం శోచనీయమని, గ్రామీణ ప్రాంత ప్రజలు గుక్కెడు నీటి కోసం అలమటించి పోతున్నారని, పనులు లేక సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పేద ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం వారి కోసం కేటాయించే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు అభివృద్ధి పేరుతో కూటమి నాయకులు స్వాహా చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు మంచి జరిగే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరిచారని, రెండు సంవత్సరాల పాటు రాష్ట్రంలో కరోనా మహమ్మరి విజృంభించి కష్టకాలంలో నెట్టివేసినా పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదని సంక్షేమ పథకాలను సజావుగా అమలు పరిచారని, మహిళలకు పెద్దపీట వేసి అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌ లాంటి పథకాలకు సంబంధించిన నిధులను నేరుగా వారి అకౌంట్‌లో జమ చేశారని, నేడు అటువంటి పరిస్థితి లేకుండా పోయిందని, అనేక మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక తమ చదువులు సక్రమంగా ముందుకు సాగడం లేదని, విద్య పూర్తి చేసిన విద్యార్థులకు ఆయా విద్యా సంస్థల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగులు ముందుకు వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న ఆరాచకాలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. తమ ఉద్యోగ బాధ్యతలతో పాటు తమ కుటుంబం, గ్రామ పరిస్థితులను కూడా అవగాహన చేసుకొని ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తాటిపర్తి పిలుపు ఇచ్చారు. సమావేశంలో త్రిపురాంతకం మండలానికి చెందిన దాదాపు 200 మంది ఐటీ ఉద్యోగులు, నియోజకవర్గ ఐటీ విభాగం అధ్యక్షుడు దుద్యాల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

రూ.కోట్ల ప్రభుత్వ ఆస్తులు పెత్తందారులకు అప్పగింత

అవినీతి పాలకుల భరతం పట్టేందుకు నడుం కట్టండి

ఐటీ ఉద్యోగుల సమావేశంలో ఎమ్మెల్యే తాటిపర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement