
అంతర్ జిల్లాల దొంగలు అరెస్టు
● పది లక్షల విలువైన బంగారంతో పాటు రెండు బైకులు స్వాధీనం
● తక్కువ సమయంలోనే చైన్‌స్నాచర్ల అరెస్టు
● పోలీసులను అభినందించి రివార్డులు ఇచ్చిన డీఎస్పీ
మేదరమెట్ల: పలు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను కొరిశపాడు మండలం మేదరమెట్ల వై.జంక్షన్ వద్ద శనివారం మేదరమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై చీరాల డీఎస్పీ ఎస్‌డీ మొయిన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఒకటో తేదీ సాయింత్రం వరుసగా రెండు చైన్‌స్నాచింగ్ సంఘటనలు మేదరమెట్ల పోలీస్టేషన్ పరిధిలో జరిగాయి. దీనిపై ఎస్పీ ఆదేశాల మేరకు అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు మేదరమెట్ల, కొరిశపాడు, పంగులూరు ఎస్‌ఐలు షేక్ మహ్మద్ రఫీ, వై.సురేష్, బి.వినోద్‌బాబులు టీమ్‌గా ఏర్పడి సీసీ కెమారాల ఆధారంగా ఆధునికి సాంకేతికతను వినియోగించుకుంటూ దొంగల కోసం ఆధారాలను సేకరించారు. కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన దర్శనాల ఏడుకొండలు, అదే గ్రామానికి చెందిన షేక్ ఆషిద్‌లను వై.జంక్షన్ వద్ద అరెస్టు చేశారు. నిందితుల నుంచి 126 గ్రాములు బంగారు చైన్‌లు, రెండు మోటారు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఏడుకొండలుపై గతంలో చీమకుర్తి స్టేషన్‌లో మూడు, టంగుటూరు స్టేషన్‌పరిధిలో ఒక కేసు నమోదై ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. రెండో నిందితుడు షేక్ ఆషిద్‌పై కొత్తపట్నం పొలీసుస్టేషన్ పరిధిలో ఒకటి, ఒంగోలు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో రెండు దొంగతనాల కేసులు ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడు వీరిద్దరూ అరెస్టు కాకుండా ఉంటే ముప్పవరం, పంగులూరు, కొరిశపాడు సమీప గ్రామాల్లో చైన్‌స్నాచింగ్‌లు పెరిగి పోయేవన్నారు. వేసవి కాలం కావడంతో దొంగతనాలు పెరిగే అవకాశం ఉందని, ఒంటరిగా ఉండే మహిళలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ హెచ్చరించారు. అంతర్ జిల్లాల దొంగలను పట్టుకున్న సందర్భంగా సీఐ, ఎస్‌ఐలు నాయబ్ రసూల్, తిరుపాల్‌రెడ్డి, జి.సురేష్, ఎన్.రమేష్‌లను రివార్డులతో డీఎస్పీ అభినందించారు.

అంతర్ జిల్లాల దొంగలు అరెస్టు